ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కృష్ణకు వివాదం చోటు చేసుకుంది. దీంతో స్టార్ సింగర్ బాలునే పక్కన పెట్టేశాడు. కొన్ని విషయాల్లో కృష్ణ చాలా మొండిగా ఉండేవారు.  

80వ దశకంలో బాలు సింగర్ గా వెలిగిపోతున్నారు. బాలు పాడితేనే పాట అన్న రోజులు అవి. ప్రతి సినిమాలో ఐదారు పాటలు బాలునే పాడేవారు. బాలు పాడితే సినిమాకు ప్లస్ అవుతుందని అనుకుంటున్న సమయంలో కృష్ణ తీసుకున్న సాహస నిర్ణయాలు చూస్తే విస్తుపోవాల్సిందే. ఒక సందర్భంలో కృష్ణ తనతో కఠినంగా మాట్లాడారని ఆయన చిత్రాలకు పాటలు పాడేది లేదని బాలు మంకు పట్టుబట్టారు. 

ఈ విషయం తెలిసిన కృష్ణ కూడా అదే బెట్టు మైంటైన్ చేశారు. 1986లో కృష్ణ స్వీయ దర్శకత్వంలో సింహాసనం తెరకెక్కింది. ఇది భారీ బడ్జెట్ మూవీ. కృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి సంగీతం అందించారు. ఈ మూవీలో పాటలన్నీ రాజ్ సీతారామ్-పి సుశీల పాడారు. సింహాసనం పాటలు గ్రాండ్ సక్సెస్. తెలుగుకు ప్రేక్షకులకు రాజ్ సీతారామ్ గొంతు భిన్నంగా తోచింది. అప్పట్లో సింహాసనం పాటలు ప్రతి వేడుకలో మారుమ్రోగేవి. 

ఎస్పీ బాలును కాదని కృష్ణ అంత పెద్ద విజయం సాధించారు. వేటూరి, రాజ్ కోటి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేశారట. అయినా వివాదం సద్దుమణగలేదట. ఒకరోజు బాలు పద్మాలయా స్టూడియోకి వచ్చారట. అప్పుడు బాలు, కృష్ణ మనసు విప్పి మాట్లాడుకున్నారట. ఈ ఇగోలు, మనస్పర్థలు వదిలేసి కలిసి పని చేద్దాం అనుకున్నారట. అలా వివాదం ముగిసింది. తర్వాత కృష్ణ చిత్రాలకు బాలు అనేక పాటలు పాడారు.