మెజేజ్ కు , ఫన్ ని కలిపి  అందించే సినిమాలు తమిళంలో ఎక్కువగా వస్తుంటాయి. ఈ టైప్ లోకి వస్తుంది తమిళ నటుడు యోగిబాబు నటించిన ‘మండేలా’ సినిమా. రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్‌  ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. తక్కువ బడ్జెట్‌దే అయినా, దర్శకుడు అశ్విన్‌ చేతిలో చక్కగా రూపొందింది. ఈ సినిమాని ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం.  నటుడిగా యోగిబాబుకు మరింత పేరుని తెచ్చిపెట్టిన ఈ సినిమాపై బండ్ల గణేష్ కన్నేసారు అన్నారు. ఆయనే ఈ మూవీ తెలుగు రీమేక్ రైట్స్ కోసం  గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు సీన్ లోకి సునీల్ వచ్చినట్లు సమాచారం. 
 
పొలిటిక‌ల్ సెటైర్‌తో పాటు కామెడీ చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమా రైట్స్ ఇప్పటికే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద‌క్కించుకోగా, రీమేక్ లో సునీల్ అయితే బాగుంటుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. ఆయ‌న‌తో నిర్మాత‌లు సంప్ర‌దించేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్టు టాక్. పొలిటికల్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ బాగానే వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నారు. ద‌ర్శ‌కుడిని ఫైన‌లైజ్ చేశాక మూవీపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. 

సినిమాలో ప్రస్తుత రాజకీయాలతో పాటు ఒక్క ఓటు కూడా ఎంత కీలకమో అనే అంశాన్ని వివరించారు. ఓ కుగ్రామంలోని స్థానిక ఎన్నికలే ఇతివృత్తం. హీరో యోగిబాబు ఓ క్షురకుడిగా పొట్టపోసుకుంటుంటాడు. అతని పాత్రనే ఇప్పుడు సునీల్ వేయబోతున్నారట. కథలో భాగంగా అతని  ఓటు కీలకం కావడంతో ఎలక్షన్స్ లో నిలబడ్డ అభ్యర్థులు తమకే ఓటు వేయాలని అతని చుట్టూ తిరుగుతుంటారు. ఈ క్రమంలో ఉచిత కానుకలు, హామీలు, బెదిరింపులు, దాడులు జరుగుతాయి. ఇలా అనేక మలుపులు తిరిగిన సినిమా చివర్లో ఉత్కంఠగా ముగుస్తుంది.