హీరో సందీప్ కిషన్ కి  జీహెచ్ఎంసీ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. అతడు హీరోగా నటిస్తోన్న 'నిను వీడను నీడను నేనే' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సందీప్ నటించడంతో పాటు నిర్మాణ వ్యవహారాలు కూడా చూసుకున్నాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం సిటీ మొత్తం పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మెట్రో పిల్లర్ల వద్ద ప్రచార పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ పోస్టర్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు.

పోస్టర్లలో హీరో, హీరోయిన్లను అసభ్యంగా చూపించారని ఉప్పల్ కు చెందిన కొంతమంది ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉప్పల్ మెట్రో పిల్లర్ల వద్ద ఏర్పాటు చేసిన సినిమా పోస్టర్లను చించేశారు. 

అధికారుల తీరుపై చిత్రబృందం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సినిమా ప్రమోషన్స్ కోసం జీహెచ్ఎంసీ అధికారుల అనుమతి తీసుకున్నామని.. అయినప్పటికీ పోస్టర్లు తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.