ప్రస్తుతం టాలీవుడ్,  బాలీవుడ్‌,కోలీవుడ్ అనే తేడా లేకుండా పెద్ద నటులు, దర్శకులు సైతం వెబ్‌ సీరీస్‌లో నటిస్తుండటంతో ట్రెండ్‌గా మారింది. ఇక భవిష్యత్తు డిజిటల్‌ యుగానిదే. ఇకపై అంతా ఇంటర్ నెట్ మయం కానుంది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే రోజులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ కరోనా రోజుల్లో అందరూ ఆన్‌లైన్‌లో వెబ్‌ సీరీస్‌ చూస్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కు వెళితే ఖర్చు తడిసి మోపెడవుతోంది. పాప్‌కార్న్‌, పార్కింగ్‌ వంటి ఖర్చులు ప్రేక్షకులకు పెద్ద సమస్యగా మారాయి. అందుకే వెబ్‌ సీరీస్‌లోకి పెద్దవాళ్లు రావటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ సైతం ఈ రంగంలోకి దూకుతున్నట్లు సమాచారం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సుకుమార్ ఓ ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుకుమార్ లవ్ స్టోరీలపై మంచి పట్టుంది. అదే పద్దతిలో ఆయన తొమ్మిది ప్రేమ కథలతో ఓ వెబ్ సీరిస్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  ఈ సిరీస్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయిటకు వచ్చాయి. ఈ వెబ్ సీరిస్ ...హాంకాంగ్ లో వచ్చిన ఓ నవల బేస్ గా సాగుతుందిట. ఆ నవల రైట్స్ తీసుకుని మరీ సుకుమార్ తీస్తున్నారట.

సుకుమార్ డిజిటల్‌ ప్రపంచంలోకి రావడానికి ఒకే ఒక్క కారణం.. వెండితెర మీద ఆయనకు నచ్చినట్లు చెప్పనివ్వని కథల్ని ఎవరి గురించీ పట్టించుకోకుండా ఆయనకు నచ్చినట్లు చెప్పడం కోసం అంటున్నారు. అయితే అది అల్లు అర్జున్ రిక్వెస్ట్ పైన మరికొందరు అంటున్నారు. అల్లు అర్జున్ తన తండ్రి ఆహా కోసం అడిగితే సుకుమార్ ఓకే చెప్పారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ వెబ్ సీరిస్ లో అన్ని ఎపిసోడ్స్ ఆయనే డైరక్ట్ చేయరట. ఈ వెబ్ సిరీస్‌లో తొమ్మిది మంది హీరోలు న‌టిస్తే.. తొమ్మిది మంది ద‌ర్శ‌కులు దీన్ని తెర‌కెక్కిస్తార‌ని వినిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను ఓ ప్ర‌ముఖ సంస్థ‌తో క‌లిసి సుకుమార్ నిర్మిస్తార‌ని స‌మాచారం. అది ఆహా కావచ్చు అని తెలుస్తోంది.

మరో ప్రక్క సేమ్ టు సేమ్ ఇలాగే  వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించ‌డానికి  మ‌ణిర‌త్నం ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టేశారు. ఆయ‌న ‘నవరస’ అనే పేరుతో వెబ్ సిరీస్ చేయనున్నారు. ఇందులోనూ తొమ్మిది మంది హీరోలు న‌టిస్తే.. తొమ్మిది మంది ద‌ర్శ‌కులు డైరెక్ట్ చేస్తార‌ట‌. ఈ విషయంలో మ‌ణిర‌త్నం, సుకుమార్ ఐడియాల‌జీ ఒకేలా ఆలోచిస్తున్నారన్నమాట.