జేపీ థుమినాద్ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ "సు ఫ్రం సో" థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత త్వరలో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలోకి ‘సు ఫ్రం సో’

కన్నడలో జూలై 25న విడుదలైన హారర్ కామెడీ చిత్రం "సు ఫ్రం సో" థియేటర్లలో సంచలన విజయం సాధించింది. దర్శకుడు జేపీ థుమినాద్ స్వగ్రామం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. విడుదలైన రెండు వారాల్లోనే దేశీయంగా రూ.43 కోట్ల నికర వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, ఇటీవల కాలంలో అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి స్ట్రీమింగ్ హక్కులు జియోహాట్‌స్టార్ పొందింది. సెప్టెంబర్ 5న ఓటీటీలో రిలీజ్ చేయాలని ముందుగా నిర్ణయించినా, ఇప్పటివరకు ప్లాట్‌ఫాం అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కారణంగా అభిమానులు ఆతృతగా డిజిటల్ రిలీజ్ తేదీని ఎదురుచూస్తున్నారు."సులోచన ఫ్రం సోమెశ్వర" అనే వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, గ్రామీణ నేపథ్యంలో హారర్, కామెడీ, భావోద్వేగ నాటకాన్ని సమ్మిళితం చేస్తుంది. 

కథ ఏంటంటే

కథలో హీరో అశోక (షనిల్ గౌతమ్) నిర్లక్ష్యంగా జీవించే యువకుడు. కానీ గ్రామస్తులు అతను సులోచన అనే ఆత్మవశం అయ్యాడని అనుమానించడంతో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. మొదట భయానక రహస్యం లా మొదలైన ఈ కథ, తర్వాత హాస్యం, హృద్యమైన భావోద్వేగం, సామాజిక సందేశంతో కూడినదిగా మారుతుంది.ఈ చిత్రంలో సంధ్యా అరకెరె, ప్రకాశ్ థుమినాద్, మైమ్ రామ్‌దాస్ ముఖ్యపాత్రల్లో నటించారు. సంగీతం, సన్నివేశాలు, గ్రామీణ వాతావరణాన్ని సహజంగా చూపిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా తుది రూపం దాల్చే వరకు 26 సార్లు స్క్రిప్ట్ రీ-రైట్స్ జరిగాయి. ఆ కృషి వృథా కాలేదు. కథనం, సహజత్వం, ప్రదర్శనతో విమర్శకులు, ప్రేక్షకులు ఇద్దరూ ప్రశంసించడంతో, ఈ చిత్రం బలమైన వర్డ్ ఆఫ్ మౌత్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో కూడా అదే విజయాన్ని సాధిస్తుందనే ఆశలు ఉన్నాయి.