పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలకు ఏర్పాట్లు చేస్తూ ముగ్గురు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. గత రాత్రి జరిగిన ఈ సంఘటనపై మెగా ఫ్యామిలీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. పవన్‌ కళ్యాణ్ తో పాటు చిరంజీవి, రామ్‌ చరణ్‌లు కూడా అభిమానుల మృతికి సంతాపం తెలిపారు. పవన్‌ మృతులకు 50 వేల రూపాయల చొప్పున సాయం అధించాలని జనసేన నేతలను ఆదేశించారు.

పవన్‌ చిత్ర నిర్మాతలు కూడా 2 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా మరో మెగా హీరో స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా అభిమానులకు తన వంతు సాయాన్ని ప్రకటించాడు. ఒక్కొక్కరి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ఇవ్వనున్నట్టుగా ప్రకటించాడు బన్నీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన బన్నీ, వారికి తన వంతు సాయం అందిస్తున్నట్టుగా ప్రకటించాడు.

సెప్టెంబర్ 2 పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు కావటంతో గత వారం రోజులుగా పవన్‌ అభిమానులు ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో పవన్‌ ఫ్లెక్సీ ఏర్పాట్టు చేస్తూ విధ్యుత్‌ ఘాతానికి గురై అభిమానులు తుదిశ్వాస విడిచారు. వారి తల్లి దండ్రులకు నేను బిడ్డగా ఉంటానని మాట ఇచ్చాడు పవన్ కళ్యాణ్.