తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటికి రెండు సీజన్లను పూర్తి చేసుకొంది. ఇప్పుడు మూడో సీజన్ కోసం షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. పోటీదారులుగాకాస్త పేరున్న సెలబ్రిటీలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. 

మరోపక్క హోస్ట్ ని కన్ఫర్మ్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి. దాదాపుగా నాగార్జున ఫైనల్ అయినట్లే అని చెప్పారు. అయితే ఇప్పుడు తెరపై మరో హోస్ట్ పేరు వచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సదరు హోస్ట్ హీరో కాదు.. స్టార్ హీరోయిన్ అనుష్క.

'బాహుబలి' చిత్రంతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న అనుష్కఆ తరువాత 'భాగమతి'తో మరో సక్సెస్ అందుకుంది. జనాల్లో ఆమెకున్న స్టార్ డమ్ ని దృష్టిలో పెట్టుకొని ఆమెతో షో హోస్ట్ చేయిస్తే ఎలా ఉంటుందని షో నిర్వాహకులు ఆలోచిస్తున్నారట. లేడీ హోస్ట్ ని తీసుకుంటే షో కూడా బ్యాలన్సింగ్ గా ఉండే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు.

అయితే ఇది ఇంకా ప్రపోజల్ స్టేజ్ లోనే ఉంది. కానీ ఈ విషయం తెలిసిన కొందరు సినీ సెలబ్రిటీలు మాత్రం షాక్ అవుతున్నారు. ఇప్పటికే కొందరు హీరోలు హోస్ట్ లుగా మారి షోలు చేస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్లు కూడా మొదలుపెడితే బుల్లితెరకి డిమాండ్ పెరిగిపోవడం ఖాయం. మరి ఈ విషయంలో అనుష్క ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!