శ్రీను వైట్ల తాజా చిత్రం‘అమర్ అక్బర్ ఆంటోని’డిజాస్టర్ అయ్యింది. అందులో మొహమాటం ఏమీ లేదు. ఇప్పుడు ఇది కెరీర్ కు పెద్ద దెబ్బ. శ్రీను వైట్ల కథ చెప్తానంటే ఏ హీరో ఉత్సాహం చూపించడు.  తన రొటీన్ కథలు, కామెడీ ట్రాక్ లతో శ్రీను వైట్ల దెబ్బతిన్నాడని మీడియా హోరెత్తుతోంది.

దానికి తోడు   మహేష్ తో చేసిన  ‘ఆగడు’ తర్వాత ‘బ్రూస్ లీ’, ‘మిస్టర్’ ఇప్పుడేమో ‘అమర్ అక్బర్ ఆంటోని’వరస పెట్టి అన్ని తన్నేయటంతో ఏ క్యాంప్ కు వెళ్లి కథ చెప్పాలన్నా సమస్యే. ఇదంతా ఒకెత్తు ‘అమర్ అక్బర్ ఆంటోని’రెమ్యునేషన్ రూపాయి కూడా చేతికి రాకపోవటం మరో సమస్య.

అదెలా అంటే..‘అమర్ అక్బర్ ఆంటోని’మంచి హిట్ అవుతుందని నమ్మి, రవితేజను ఒప్పించటంతో..మైత్రీ మూవీస్ వాళ్లు ఓకే చేసారు. అయితే రెమ్యునేషన్ విషయం దగ్గర కి వచ్చేసరికి శ్రీను వైట్ల అడిగిన నాలుగు కోట్లు ఎక్కువ అనిపించాయి. దాంతో వాళ్ళు  తగ్గించుకోమంటే..తనకు వాటా కావాలని పట్టుబట్టాడట. పాతిక కోట్లు లోపు బడ్జెట్ లో సినిమా లాగేసాడు. తక్కువ రోజులు, తక్కువ బడ్జెట్ బాగానే ఉంది కానీ..సినిమా హిట్ అయ్యితే అది కౌంట్ లోకి వస్తుంది. కానీ సినిమా పోవటంతో దాన్ని పట్టించుకునే వాళ్ళే లేరు.

ఇక ఈ సినిమాకు తన రెమ్యునేషన్ గా  వాటా అడగటంతో...రూపాయి కూడా శ్రీను వైట్లకు ముట్టలేదట. మొదట నిర్మాతలు ఇస్తానన్న మొత్తం తీసుకుని ఉంటే ..ఆ డబ్బులు అయినా గిట్టు బాటు అయ్యేవి. కానీ సినిమా మీద నమ్మకంతో ..వాటా పెట్టుకుని ఆర్దికంగా నాలుగైదు కోట్లు నష్టపోయాడని ఇండస్ట్రీ టాక్.