బిగ్ బాస్ సీజన్ 12 రియాలిటీ షోలో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. తన ఆటతో, యాక్టివిటీస్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రీసెంట్ గా తనపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై తన హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు శ్రీశాంత్.

తనను క్రికెట్ మైదానం వద్ద కనిపించకూడదని, ఆట చూడడానికి రాకూడదని, మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడినట్లు ఆధారాలు లేకపోయినా నింద మోపారని ఏడ్చేశాడు. ఈ సంఘటన కారణంగా తాను కుమిలిపోయానని, సూసైడ్ చేసుకుందామని అనుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజస్థాన్ రాయల్స్ జట్టు సహజయమాని రాజ్ కుంద్రా ఫన్నీ ఎమోజీతో ఎపిక్ అని ఒక కామెంట్ పెట్టాడు. రాజ్ కుంద్రా ఈ విధంగా శ్రీశాంత్ ని ఎగతాళి చేయడంతో అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కూడా ఈ విషయంలో రాజ్ కుంద్రాపై మండిపడింది. శ్రీశాంత్ పై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలియకుండా మాట్లాడుతున్నట్లున్నారు అంటూ ట్వీట్ చేసింది. 2013లో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి.

దీంతో అతడిని క్రికెట్ కి దూరం చేశారు. ఆ ఆరోపణల్లో సాక్ష్యాలు దొరకకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా తీర్పునిచ్చింది. అయినప్పటికీ బీసీసీఐ అతడిపై నిషేధాన్ని  ఎత్తివేయలేదు.