ఇప్పటికే బిగ్ బాస్‌ షో తెలుగులో మూడు సీజన్‌లు పూర్తి చేసుకుంది. ఒక్కో సీజన్‌కు సరికొత్త రికార్డ్‌లు సెట్‌ చేస్తున్న ఈ షో తాజాగా నాలుగో సీజన్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృభిస్తున్న నేపథ్యంలో తాజా సిరీస్ విషయంలో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి షో ఉంటుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షో నిర్వహించేందుకే నిర్వాహకులు మొగ్గు చూపారు.

ఇందులో పాల్గొనబోయే హౌస్‌ మేట్స్‌, టెక్నీషియన్స్‌ తో పాటు అందరికీ ప్రత్యేకంగా ఇన్సూరెన్స్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నారట నిర్వాహకులు. అంతేకాదు షోలో పాల్గొనబోయే వారికి ముందే కోవిడ్‌ టెస్ట్‌లు చేయటంతో పాటు వారిని షో ప్రారంభం అవ్వటానికి 15 రోజుల ముందే క్వారెంటైన్‌కు తరలించే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండవద్దని నిర్వాహకులు భావిస్తున్నారట.

ఇక హోస్ట్‌గా వ్యవహరించబోయే నాగార్జున కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెట్‌ లో ఎవరూ నాగ్‌ను కలిసేందుకు అనుమతించకూడదని నిర్ణయించారు. ఒక్క మేకప్‌ మేన్‌ తప్ప ఇతరులెవరూ నాగ్‌ను కలవకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సెట్‌ ఎప్పుడూ ఓ ఆరోగ్య బృంధం ఉండి కంటెస్టెంట్‌ల ఆరోగ్య పరిస్థితిని  పరీక్షించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.