2020 సంవత్సరంలో కరోనా మిగిల్చిన విషాదాలలో గానగంధర్వుడు ఎస్పీ బాలు మరణం ఒకటి. కరోనా బారిన పడిన ఆయన నెలరోజుల పాటు వైరస్ తో పోరాడి చివరకు మృత్యువు వడిలోకి చేరారు. సంగీత ప్రేమికులను, సినీ ప్రముఖులను, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను కలచివేసింది బాలు మరణ వార్త. వేల పాటలు పాడిన గొంతు మూగబోయిందని తెలిసి సంగీతం చిన్నబోయింది. 


బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలు 75వ జయంతి నేడు. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎస్పీ బాలును గుర్తు చేసుకున్నారు. కాగా ఎస్పీ బాలుకు అత్యంత సన్నిహితులు అయిన మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా వీడియో సందేశం విడుదల చేశారు. అలాగే బాలుగారితో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 


కెరీర్ ప్రారంభం నుండి చిరంజీవి, బాలుగారిని అన్నయ్య అని పిలిచేవారట. ఓ సందర్భంలో చిరంజీవి ఆయనను బాలుగారు అని సంబోధించారట. అన్నయ్య అని ప్రేమగా పిలిచేవాడివి గారు అంటున్నావేంటయ్యా అని అయన బాదపడ్డారట. గారు అని పిలిచి బంధాన్ని దూరం చేయకు, ఎప్పటిలాగే అన్నయ్య అని పిలువు అన్నారట. ఇక బాలుగారిని స్మరించుకుంటూ ఆయన చెల్లి ఎస్పీ వరలక్ష్మీ పాడిన ఓ పాటను చిరంజీవి పంచుకోవడం జరిగింది.