ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం హెల్త్ కండిషన్ మెల్లిగా మెరుగుపడుతోందని ఆయన కుమారుడు చరణ్ వెళ్లడించారు. అలాగే  నిన్నట్నుంచి బాలు నోటితో ఆహారం తీసుకుంటున్నారు. కాకపోతే ఇంకా వెంటిలేటర్ మీదే ఉంచారు. కరోనా సోకడంతో కొన్ని రోజులుగా ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 
 
చరణ్ మాట్లాడుతూ.."నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. అయినప్పటికీ ఆయనకు వెంటిలేటర్ సహాయంతోనే ఆక్సిజన్ అందిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఊపిరితిత్తులు ఇంకా రికవర్ అవ్వాల్సి ఉంది. మిగతావన్నీ నార్మల్ గా ఉన్నాయి. రోజూ ఫిజియోథెరపీ చేస్తున్నారు. నిన్నట్నుంచి నాన్న నోటితో ఆహారం తీసుకుంటున్నారు. ఇది ఆయనలో శక్తిని మరింత పెంచుతుంది." అన్నారు.  
 
ప్రస్తుతం బాలు, డాక్టర్ల   సహాయంతో లేచి కూర్చుంటున్నారు. 15-20 నిమిషాల పాటు కూర్చోగలుగుతున్నారు. ఎస్పీబీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రముఖ నటుడు రజనీకాంత్, కమలహాసన్, దర్శకుడు భారతీరాజా, ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సోషల్ మీడియా  ద్వారా తమ ఆకాంక్షను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బాలు త్వరగా కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు చేశారు.