ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీబాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించినట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే బాలసుబ్రమణ్యం కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే ఇతర అనారోగ్య కారణాల వల్ల ఆయనకు ట్రీట్‌మెంట్‌ జరుగుతుందన్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఎంజీఎం ఆస్పత్రి ఏ విధమైన బులిటెన్ విడుదల చేయలేదు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాన్ని ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ బాలు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. రోజు రోజుకు మరింత మెరుగుపడుతుందని చెప్పారు. కానీ ఇంతలో మరోసారి ఆయన అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తుంది. పరిస్థితి కాస్త విషమంగానే ఉందని ఎంజీఎం ఆసుపత్రి వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్‌ విడుదల చేయనున్నారు. 

కరోనా కారణంగా గత నెల మొదటి వారంలో బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో జాయిన్‌ అయిన విషయం తెలిసిందే. గత 40 రోజులుగా ఆయన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఒకానొక టైమ్‌లో ఆయన ఆరోగ్యం మరింత విషమించిందన్నారు. ఐసీయూలో, వెంటిలేషన్‌పై, ఎక్మో విధానంలోనూ ట్రీట్‌ మెంట్‌ అందించారు. విదేశీ వైద్యులు సైతం ఆయనకు ట్రీట్‌మెంట్‌ చేశారు. ఎంతో పోరాటంతో ఆయన గత వారం రోజుల క్రితం కరోనా నుంచి నెగటివ్‌ పొందినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆరోగ్యం విషమించిందనే వార్తతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.