Asianet News TeluguAsianet News Telugu

Sonu Sood: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ప్రాణాలు కాపాడిన సోనూ సూద్!

నటుడు సోనూ సూద్ సేవలు కొనసాగుతున్నాయి. ఏ పేదవాడు సాయం కోరినా కాదనకుండా ఆయన చేస్తున్నారు. తాజాగా సోనూ సూద్ ఏడు నెలల చిన్నారి ప్రాణాలు కాపాడారు. 
 

sonu sood saves 7 months old baby boy mohammad safan ali
Author
Hyderabad, First Published Jul 20, 2022, 3:51 PM IST

కరీంనగర్ కి చెందిన మహ్మద్ సఫన్ అలీ అనే ఏడు నెలల బాలుడు అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ చిన్నారి బైలియరీ అట్రీసియా అనే వ్యాధిబారిన పడ్డట్లు వైద్యులు గుర్తించారు. బాలుడు లివర్ ని దెబ్బతీసే ఈ వ్యాధికి చికిత్సగా ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంది. ఖర్చుతో కూడుకున్న చికిత్సను మహ్మద్ సఫన్ అలీ తల్లిదండ్రులు భరించే స్థితిలో లేరు. సోనూ సూద్(Sonu Sood) ని సాయం కోరడంతో ఆయన ముందుకు వచ్చారు. కేరళలోని కొచ్చి నగరంలో సఫన్ అలీకి చికిత్స అందించారు. 

ఎస్తేర్ మెడ్ సిటీ హాస్పిటల్ లో ఏడు నెలల బాలుడైన సఫన్ అలీకి లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. సోనూ సూద్ సహకారంతో ఎస్తేర్ వాలంటీర్ సభ్యులు ఈ మంచి పని పూర్తి చేశారు. అనంతరం సోనూ సూద్ మాట్లాడుతూ ''భారత దేశంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మహ్మద్ సఫన్ అలీ తల్లిదండ్రులు వంటి పేదవారికి అవి అందుబాటులో ఉండడం లేదు. అలాంటి వారిని ఆదుకోవడానికి మా ఫౌండేషన్ ఎప్పుడూ ముందు ఉంటుంది'' అని  ఆయన తెలియజేశారు.. 

 అలాగే తెలంగాణకు చెందిన రామ్ ప్రసాద్ అనే యువకుడు కోమాలోకి వెళ్ళాడు. అతడికి వైద్య సహాయం అందించాలని కుటుంబ సభ్యులు సోనూ సూద్ ని వేడుకున్నారు. విషయం తెలిసిన సోనూ సూద్ రామ్ ప్రసాద్ వైద్యానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. ఇటీవల కోలుకున్న రామ్ ప్రసాద్ సోనూ సూద్ కి కృతజ్ఞతలు తెలిపారు. రామ్ ప్రసాద్ స్వయంగా ముంబైలోని సోనూ సూద్ నివాసానికి చేరుకొని ఆయన్ని కలిశారు. 

గత రెండేళ్లుగా సోనూ సూద్ దేశవ్యాప్తంగా అనేక మంది పేదవారిని వివిధ రూపాల్లో ఆదుకున్నారు. కేవలం సోషల్ మీడియాలో తమ సమస్య తెలియజేస్తే చాలు ఆయన స్పందిస్తారు. ఇక కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సేవలు ప్రాచుర్యం పొందాయి. లాక్ డౌన్ కారణంగా ముంబై నగరంలో ఇరుక్కుపోయిన వలస కూలీల కోసం ఆయన సొంత ఖర్చులతో వాహనాలు ఏర్పాటు చేసి స్వగ్రామాలకు చేర్చారు. అప్పటి నుండి ఆయన తన సేవలు కొనసాగిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios