బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై తాజాగా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ లో ఢిల్లీకి చెందిన ఓ ఈవెంట్ మేనేజర్ సోనాక్షిపై కేసు పెట్టారు. ఓ ఈవెంట్ లో డాన్స్ చేస్తానని ఒప్పుకున్న సోనాక్షి పారితోషికంగా రూ.24 లక్షలు అడిగారట.

దీనికి మేనేజర్ కూడా ఒప్పుకున్నారు. అయితే ఆ డబ్బు తీసుకున్న తరువాత సోనాక్షి ఢిల్లీకి రాలేదని ఆరోపిస్తూ మొరాదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు పెట్టాడు. ఈ క్రమంలో మొరాదాబాద్ పోలీసులు ముంబైలోని జుహు పోలీసులను కేసు నిమిత్తం ఆశ్రయించారు.

వారితో చర్చించిన అనంతరం పోలీసు బృందం శుక్రవారం సోనాక్షి నివాసంలో సోదాలు నిర్వహించింది. అయితే సోనాక్షి నుండి వాంగ్మూలం తీసుకోవడానికి ఆమె ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన సోనాక్షి ట్విట్టర్ లో ఓ ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. ఓ ఈవెంట్ ఆర్గనైజర్ తన పనిని సరిగ్గా నిర్వర్తించకపోగా.. నన్ను కేసులో ఇరికించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు అంటూ మండిపడింది.

అయితే మీడియా వర్గాల్లో తనకు ఎలాంటి మచ్చ లేదని.. తన టీం తనకు ఎంతగానో సహకరిస్తుందని.. విచారణ జరుగుతోందని.. ఇలాంటి మూర్ఖుల మాటలను నమ్మొద్దని మీడియా వర్గాలను కోరుకుంటున్నట్లు తెలిపింది.