బయోపిక్ అంటేనే వివాదాలతో  నిండి ఉండాలా..లేకపోతే జనం చూడరా అంటే ఏదో హాట్ టాపిక్ సినిమాలో లేకపోతే ఎందుకు జనాలు సినిమా చూడటానికి వస్తారు అనే సమాధానం వస్తుంది. ఇప్పుడు జయలలిత బయోపిక్ కు సైతం అదే సమస్య వస్తోంది. ఈ సినిమాలో ఏమన్నా హాట్ టాపిక్ లు చర్చిస్తే జనం ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు. అలాగని పూర్తిగా నిజాలను ప్రక్కన పెట్టేసి ఏదో నామ మాత్రంగా భజన చేసినట్లు తెరకెక్కిస్తే చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ డైలమాలో దర్శకురాలు ప్రియదర్శిని ఉందని సమాచారం. 

విషయంలోకి వస్తే.. తమిళ మహిళా దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తన్న సంగతి తెలిసిందే. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న  ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ అయ్యి హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో  ఈసినిమాలో ఏయో అంశాలు స్పృశిస్తారు అనేది చర్చగా మారింది. జయలలిత జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికరమైన మరియు వివాదాస్పదమైన విషయాలను కూడా బయోపిక్ లో చూపిస్తారా లేదా అన్న సంగతి ప్రస్తుతం తమిళ్ సినీ పరిశ్రమలో సోషల్ మీడియాని ఊపేస్తోంది.

ఆ చర్చలో ప్రధానంగా జయలలిత బయోపిక్ లో అలనాటి అందాల హీరో శోభన్ బాబు గురించి ప్రస్తావిస్తారా లేదా అనే విషయం చర్చించుకుంటున్నారు. బయోపిక్ లో ఆ విషయం ప్రస్తావించకపోతే అప్పుడు బయోపిక్ పరిపూర్ణం కానట్లే. ఒకవేళ ప్రస్తావిస్తే జయలలిత అభిమానులు మనోభావాలు దెబ్బతింటాయని కూడా చిత్ర యూనిట్ భావిస్తోంది. 

ఈ క్రమంలో శోభన్ బాబు పాత్రను కేవలం గెస్ట్ రోల్ గానే చూపించి ముగించాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తమిళ  సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ బయోపిక్ లో శోభన్ బాబు పాత్ర ప్రస్తావన అస్సలు ఉండదట. పూర్తిగా జయలలిత రాజకీయ అంశాలనే చూపిస్తారట.

ఇక  ఈ బయోపిక్ ఫిబ్రవరి 24వ తేదీన జయలలిత జయంతి సందర్భంగా లాంచ్ కానుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ బయోపిక్ ని నిర్మించనుంది. ఇప్పటికే జయలలిత పాత్ర కోసం నిత్యామీనన్ ప్రత్యేకంగా బరువు కూడా పెరిగింది. మరి జయలలిత పాత్రలో నిత్యామీనన్  ఏ మేరకు అంచనాలును రీచ్ అవుతుందో చూడాలి.