'టాలీవుడ్ సింగర్ సునీత గురించి అందరికీ తెలిసిందే. గాయనిగా తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించిన ఆమె.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా ఎప్పుడు చిరునవ్వుతో కనిపిస్తుంటారామె. ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడంలోనూ ఆమె ముందుంటారు. ఇటీవల ఓ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ టాలెంట్‌ను ప్రశంసిస్తూ సునీత ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఒక అమేజింగ్ ఆర్టిస్ట్‌ను కలిశానంటూ సునీత పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది.

 

కరుణాకర్ రావు అనే సర్కిల్ ఇన్స్‌పెక్టర్ పెదాలను కదిలించకుండానే విజిల్ వేసిన వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. లిప్ మూమెంట్ లేకుండానే విజిల్ ద్వారా ఆయన ఆలపించిన ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు..’ పాటకు సునీత ముగ్ధురాలయ్యారు.


ఈ ఆర్ట్‌ను మీకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నానని చెప్పారు. వెంకటేశ్వర వైభవం అనే ప్రోగ్రాంలో పాల్గొనడం కోసం కరీంనగర్ వెళ్లిన సునీత... అక్కడే సీఐ కరుణాకర్ రావు‌ను కలిశారు. ఆయన టాలెంట్‌కు ఫిదా అయ్యారు. ఆ వీడియో చూసి నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. భారీ లైక్‌లు, షేర్లు రావడంతో.. ఆ సీఐ ఇప్పుడు ఫేమస్ అయిపోయారు.