Asianet News TeluguAsianet News Telugu

సింగర్‌ స్మిత గొప్ప దాతృత్వం..కరోనా రోగుల కోసం ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్, బెడ్లు ఏర్పాటు

ఆక్సిజన్ బెడ్స్, వెంటిలెటర్స్, ఐసీయూ బెడ్స్ కొరతతో ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితితులలో పలువురు సెలబ్రెటీలు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. సింగర్ స్మిత కూడా కరోనా బాధితులకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు.

singer smita big help to corona patients in two states  arj
Author
Hyderabad, First Published May 29, 2021, 11:23 AM IST

కరోనా రెండో దశలో భారత్ అల్లాడిపోతుంది. ఓ వైపు కరోనా మహమ్మారి కోరలు చాస్తుండగా.. మరోవైపు.. బ్లాక్, వైట్ ఫంగస్ వ్యాధులతో ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. ఇక దేశ వ్యాప్తంగా ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్స్, వెంటిలెటర్స్, ఐసీయూ బెడ్స్ కొరతతో ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితితులలో పలువురు సెలబ్రెటీలు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.  సింగర్ స్మిత కూడా కరోనా బాధితులకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. తాను పనిచేస్తున్న `ఈయో ఆంధ్రప్రదేశ్‌`, `అలై ఫౌండేషన్‌`లతో కలిసి తెలంగాణ, ఏపీలో ఆక్సిజన్‌ బెడ్స్ ఏర్పాటు చేయించే ప్రయత్నం చేస్తుంది. 

ఈ సందర్భంగా స్మిత మాట్లాడుతూ, గతంలో తను స్టాపించిన ఏఎల్‌ఏఓతో (ALAO) పాటు పలు స్వచ్చంద సంస్థలతో కలిసి వంద ఆక్సిజన్ బెడ్‏లను ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెప్పారు. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పుకోచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. `నా టీంకు ఎంతో రుణపడి ఉంటా. వారు ఎప్పుడూ కూడా నన్ను ఓడిపోనివ్వలేదు. ఎలాంటి పని అని చూడకుండా ఎంత కష్టం అని ఆలోచించకుండా నా కోసం చేసేశారు. ఒకవేళ వారంటూ లేకపోతే నా కలలన్నీ కలలుగానే ఉండిపోయేవి. 

ఈ రెండు ఫౌండేషన్ల సహకారంతో హైదరాబాద్‌, విజయవాడ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, అనంతపురం వంటి జిల్లాలను ఎంపిక చేసుకున్నాం. మేం చేస్తున్న పనిని చూసి కొందరు సినీ ప్రముఖులు విరాళాలు అందించారు. దీంతో 500 కాన్సంట్రేటర్లు, 350 ఆక్సిజన్‌ సిలిండర్లు, 300కిపైగా ఆక్సిజన్‌ బెడ్లు సిద్ధం చేశాం. విజయవాడలో వంద అక్సిజన్‌ పడకలు, అనంతపురం జేఎన్‌టీయూ హెచ్‌లో వంద పడకలు పూర్తయ్యాయి. 50 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్ కూడా ఇచ్చాం. శ్రీకాకుళం జిల్లాకి వంద ఆక్సిజన్‌ సిలిండర్లని పంపించాం. వైజాగ్‌లో 40, హైదరాబాద్‌లో 50 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందించాం.

దీంతోపాటు సైబరాబాద్‌ పోలీసులతో కలిసి ఆక్సిజన్‌ బ్యాంక్‌, ఆక్సిజన్‌ రికవరీ కేంద్రాన్ని ప్రారంభించాం. ఇది మాత్రమే సరిపోదనిపించింది. అందుకే స్మితా కేర్‌ పేరుతో కోవిడ్‌ హైల్స్ లైన్‌ ఏర్పాటు చేశాం. కాల్‌ చేస్తే వైద్యులచే రోగుల దగ్గరకు పంపే ఏర్పాట్లు చేశాం. సోషల్‌ మీడియాలో స్మితా కేర్‌ హ్యాట్‌ ట్యాగ్‌కి అవసరమున్న విషయాన్ని జోడిస్తే చాలు ఆయా సమస్యల్ని మా బృందం పరిష్కరిస్తుంది. పాత్రికేయ మిత్రులను కూడా అలై ఫౌండేషన్‌లో భాగస్వాములను చేసి గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర స్థితిలో ఉన్న ప్రజలకు సాయపడుతున్నాం. 

విజయవాడలో వెన్యూ కన్వెన్షన్‌ సెంటర్‌ని ప్రభుత్వం కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చింది. అందులో వంద ఆక్సిజన్‌ పడకలు సిద్ధం చేశారు. కానీ ఇంకా పడకలు అవసరముందని తెలుసుకున్నా. కలెక్టర్‌ని సంప్రదించి వంద పడకల ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాట్లు చేస్తామని ప్రతిపాదించాం. కలెక్టర్‌తోపాటు అక్కడి సృజనా ఫౌండేషన్‌ కూడా మా కార్యక్రమాల్ని స్వాగతించింది. అందులో మా నుంచి వంద పడకలను జోడించాం. వాటిని బెంగుళూరు ఈయో చాప్టర్‌లో సభ్యుడిగా ఉన్న ఓ వ్యక్తి తన టీమ్‌తో కలిసి కార్డ్ బోర్డ్ తో తయారు చేసి అందించారు. ఒక్కో బెడ్‌ 300కేజీల బరువుని ఆపగలదు. నలుగురు కలిసి రెండు గంటల్లో ఈ బెడ్లని తయారు చేసి పెట్టారు. ఆ సెంటర్‌లో 24గంటల్లో 16 మంది వైద్యులను ఏర్పాటు చేశాం. 

సంకల్పం మంచిదైతే, ఆ పనిని ఎవరూ ఆపలేరనిపించింది. అంత వేగంగా మేం పనులు చక్కబెట్టాం. మా ఫౌండేషన్‌ ద్వారా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించాలనుకుంటున్నా. నాకిష్టమైన సంగీతాన్ని సాధన చేస్తూనే వీలైనంత ఎక్కువ మందికి సాయం చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం 26 సామాజిక అంశాలపై ర్యాప్‌ సాంగ్స్ చేస్తున్నాం. వాటి ద్వారా కొత్త ర్యాపర్లని, మ్యూజిక్‌ డైరెక్టర్లని పరిచయం చేయబోతున్నా` అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios