మరో పాన్ ఇండియా మూవీకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్
మూడేళ్ల వరకూ ప్రభాస్ ఫుల్ బిజీ. కానీ ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం. తెలుగు దర్శకులు కన్నా ఇతర భాషల్లో భారీ సినిమాలు తీసిన డైరక్టర్స్ కు ప్రభాస్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే అలా ఆదిపురుష్ డైరక్టర్ ని, సలార్ డైరక్టర్ ని ఎంపిక చేసారు. ఇప్పుడు మరో బాలీవుడ్ డైరక్టర్ తో కూడా చేయటానికి ఓకే చేసినట్లు సమాచారం.
బాహుబలి తర్వాత ప్రభాస్ తో సినిమా అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియన్ సినిమానే అవుతుందనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చేసారు. ముఖ్యంగా బాలీవుడ్ దర్శక,నిర్మాతల దృష్టి మొత్తం ప్రభాస్ తో ఉంది. ప్రభాస్ తో సినిమా చేస్తే బాలీవుడ్ మార్కెట్ తో పాటు సౌతిండియా మార్కెట్ ని కొల్లగొట్టచ్చు అనేది వారి ఆలోచన. అందుకు తగినట్లే పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆదిపురుష్ సినిమా ప్రారంభం అవుతోంది. తాజాగా మరో బాలీవుడ్ దర్శకుడు ప్రభాస్ ని కలిసి కథ వినిపించి ఓకే చేయించుకున్నట్లు బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం.
అందుతున్న సమాచారం మేరకు.. హృతిక్ రోషన్‌తో ‘బ్యాంగ్ బ్యాంగ్, ‘వార్’ లాంటి యాక్షన్ చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.. ప్రభాస్‌తో ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని చెప్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం తాను షారూఖ్ ఖాన్ తో చేస్తున్న తమ ఆన్-గోయింగ్ ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేసి.. ఆ తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని టాక్. ఇక దర్శకుడు సిద్ధార్ద్ ఆనంద్ ‘పఠాన్’.. తర్వాత హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ సినిమాలను తెరకెక్కించనున్నాడు. ఆ తర్వాతే ప్రభాస్ తో సినిమా ఉండనుంది.
మరో ప్రక్క ‘డార్లింగ్’ ప్రభాస్ వరుసగా ‘రాధే శ్యామ్’, ‘సలార్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులతో దాదాపు మూడేళ్ల వరకు ప్రభాస్ బిజీగా ఉండనున్నాడు. ఆ తర్వాతే ఈ సినిమా మొదలవుతుంది అంటున్నారు. సిద్దార్ద్ ఆనంద్ తో సినిమా అంటే ఖచ్చితంగా యాక్షన్ ఎంటర్‌టైనర్ అయ్యింటుంది అనటంలో సందేహం లేదు. ఈ సినిమా సౌత్ ఇండియా ప్రేక్షకులకు కూడా నచ్చేలా కథను చేయమని ప్రభాస్ సూచించినట్లు చెప్పుకుంటున్నారు.