యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రద్దా కపూర్ నటిస్తున్న తొలి సౌత్ ఇండియన్ సినిమా ఇదే. 

విడుదల సమయం దగ్గరపడుతుండటంతో హైదరాబాద్, ముంబై, చెన్నై ఇలా ప్రధాన నగరాల్లో ప్రభాస్, శ్రద్దా కపూర్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. శ్రద్దా కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తొలి సారి తాను మద్యం సేవించిన అనుభవాన్ని పంచుకుంది. 

ఫ్రెండ్స్ తో పార్టీలో ఉన్నప్పుడు తొలిసారి ఆల్కహాల్ తీసుకున్నా. ఇంట్లో తెలియకుండా ఉండడానికి చాలా ప్రయత్నించా. కానీ మొదటిసారి కావడంతో కిక్కు బాగా ఎక్కేసింది. దీనితో వెకిలిగా నవ్వుతూ, పిచ్చి చేష్టలు చేస్తూ అమ్మకు కనిపించా. నేను తాగేసి వచ్చానని అమ్మ కనిపెట్టేసింది. నేను ఇంకా ఎలాంటి వెధవ వేషాలు వేస్తానో అని నన్ను గమనిస్తూ ఉండిపోయింది అని శ్రద్దా కపూర్ తెలిపింది.