చిత్రం : ఫిదా మూవీ రివ్యూ తారాగణం : వరుణ్ తేజ్, సాయి పల్లవి, సాయి చంద్, రాజా, శరణ్య ప్రదీప్ సంగీతం : శక్తికాంత్ దర్శకత్వం : శేఖర్ కమ్ముల నిర్మాత : దిల్ రాజు ఆసియానెట్ రేటింగ్ :3/5

గతంలో స్టార్ డైరెక్టర్ హోదాలో స్టార్ డమ్ సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల గత కొంత కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. తిరిగి తన సత్తా చాటేందుకు శేఖర్ కమ్ముల తాజాగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఫిదా తో ప్రేక్షకుల ముందు కొచ్చాడు. దిల్ రాజుతో చేతులుకలిపి వరుణ్ తేజ్  హీరోగా శేఖర్ తెరకెక్కించిన ఫిదా మూవీ ఏ మేరకు ఫలితాన్నిచ్చిందో చూద్దాం..

కథ:

అమెరికాలో ఉండే వరుణ్ తేజ్ ఓ పెళ్లి పని మీద తెలంగాణలోని బాన్స్ వాడ ప్రాంతంలో వుండే.. భానుమతి(సాయిపల్లవి) ఇంటికి వస్తాడు. భానుమతి సోదరి రేణుకను పెళ్లి చేసుకునేందుకు అమెరికా నుండి వచ్చిన ఎన్నారై రాజు(రాజా చెంబోలు) తో కలిసి వరుణ్ ఇక్కడికి వస్తాడు. పెల్లి చూపుల్లో రేణుకను చూసి ఇష్టపడ్డ  రాజు పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంటాడు. అదే సందర్భంలో భానుమతి, వరుణ్ ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. రాజు-రేణుకల పెళ్లి వేడుక సందర్భంలో వరుణ్ కు భానుమతితో చిన్న మనస్పర్ధలొస్తాయి. అనంతరం వరుణ్, రాజు, రేణుకలు అమెరికా వెళ్లిపోతారు. ఇక ఆ తర్వాత భానుమతి వరుణ్ ల మధ్య ఏం జరిగింది.. ఘర్షణ ఎటువైపు దారితీసింది. చివరకు ఏం జరిగింది అన్నదే మిగతా కథ.

 

ఎలా వుందంటే:

ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో కథను ఎంచుకోవడం శేఖర్ కమ్ముల శైలిని స్పష్టం చేసింది. పల్లెటూరి నేపథ్యం, అక్కా చెల్లెల అనుబంధం, వాళ్ల మధ్య సాగే సంభాషణల తీరు, తెలంగాణ పల్లెల్లో కనిపించే ఆప్యాయతలు ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇక పల్లెటూరి గడుసు పిల్లగా భానుమతి పాత్రలో సాయి పల్లవి నటన ఆకట్టుకుంటుంది. సాయి పల్లవి తన పాత్రలో చెప్పే డైలాగ్స్, తన ప్రవర్తన తీరు చాలా నేచురల్ గా ఆకట్టుకునేలా వున్నాయి. పల్లవి పంచ్ లైన్స్ కు ఫుల్ మార్క్స్ వేయచ్చు.

ఇక మాంచి అహ్లాదకర వాతావరణంలో పెళ్లి జరగటం ఆకట్టుకుంటుంది. అయితే.. పెద్దగా కారణం లేకుండా వరుణ్ ని బోల్డ్ గా వుండే భానుమతి అనుమానించడం అంత కన్విన్సింగ్ గా అనిపించదదు. పిల్లా మెల్లగ వచ్చిండే పాట స్క్రీన్ పై అద్భుతంగా అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాప్ అంతా కొంత నెమ్మదిగా సాగినట్లు అనిపించినా పాటలు ఆకట్టుకుంటాయి.

ఇక సెకండ్ హాఫ్ లో భానుమతి తప్ప మిగతా లీడ్ రోల్స్ అందరూ అమెరికా తిరిగి వెళ్తారు. వరుణ్ ప్రేమను ప్రపోజ్ చేయడం, దానికి భానుమతి రియాక్షన్ ఆ సందర్భంగా సాగే సీన్స్ ఆకట్టుకునేలా వుంటూ ఫన్ క్రియేట్ చేస్తాయి.

సెకండ్ హాఫ్ సగం వరకు సినిమా కాస్త గాడి తప్పినట్లు అనిపించినా... ప్రేమ-ద్వేషం- మళ్లీ ప్రేమ ఇలా కాస్త గజిబిజిగా అనిపిస్తుంది.. ఇద్దరి మధ్య ఘర్షణ జరగటం, తిరిగి రియలైజ్ అయి కలవడం లాంటి సన్నివేశాలు మరింత ఎఫెక్టివ్ గా  తీసి వుంటే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచేది. భానుమతి కేరక్టర్ మరింత పక్కాగా పెన్ చేసి వుండాల్సింది. ఆమె ఎందుకు ప్రేమిస్తుందో, ఎందుకు ద్వేషిస్తుందో అర్థం కాక జనం కన్ ఫ్యూజ్ అయ్యేలా వుంటుంది. కొంత ఆ కేరక్టర్ ను మరింత ఎమోషనల్ గా ఎఫెక్టివ్ గా డిజైన్ చేయాల్సింది. సినిమాలో కొత్తగా ఏమీ కనిపించకున్నా... కొత్తగా సాగే కథ బ్యాక్ డ్రాప్ అంటే.. తెలంగాణ పల్లెటూరు, అమెరికా బ్యాక్ డ్రాప్ ల మధ్య జరిగే కథ ఫ్రెష్ గా అనిపిస్తుంది.

 

నటీనటులు:

వరుణ్ తేజ్ ఎన్నారై అబ్బాయిగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. లవర్ భాయ్ లుక్స్ తో అదరగొట్టాడు. రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మలయాళీ బ్యూటీ సాయి పల్లవి అందరినీ ఫిదా చేసింది. తెలంగాణ అమ్మాయిగా రఫ్ అండ్ టఫ్ రోల్ లో మెప్పించింది. అల్లరి అమ్మాయిగా బబ్లీగా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన నటనతో మెప్పించింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన సాయిచంద్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. ఇతర పాత్రల్లో రాజా, శరణ్య ప్రదీప్, సత్యం రాజేష్ లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు:
కొంత గ్యాప్ తరువాత ఫిదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి తన మార్క్ చూపించారు. క్యూట్ లవ్ స్టోరిని తనదైన టేకింగ్ లో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. తన స్టైల్ లోనే ఎలాంటి హడావిడి లేకుండా నెమ్మదిగా సాగే కథలో అద్భుతమైన ఎమోషన్స్ పండించారు. ఇప్పటి వరకు కాలేజ్, కాలనీ బ్యాక్ డ్రాప్ లనే ఎక్కువగా చూపించిన శేఖర్, ఈ సినిమాతో తెలంగాణ పల్లెటూళ్లను మరింత అందంగా చూపించాడు. కేవలం పరిస్థితులు, యాస మాత్రమే కాదు ఇక్కడి సాంప్రదాయాలను కూడా చాలా బాగా తెరకెక్కించాడు. శక్తికాంత్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచాయి. తెలంగాణ బాణీలో సాగే వచ్చిండే పాట విజువల్‑గా కూడా సూపర్బ్. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్, తెలంగాణ పల్లె వాతావరణాన్ని, అమెరికా లోకేషన్స్ ను చాలా అందంగా చిత్రీకరించాడు. మార్తండ్ కె వెంటేష్ ఎడిటింగ్ పరవాలేదు. సినిమా నిడివి ఇంకాస్త తగ్గించి ఉంటే మరింత ఆకట్టుకునేది. దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్ గా సినిమాను తెరకెక్కించాడు.

ప్లస్ పాయింట్స్ :
వరుణ్, సాయి పల్లవి నటన, కామెడీ, ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
హీరో హీరోయిన్ల మధ్య ఘర్షణ మరింత కన్విన్సింగ్ గా లేకపోవడం, క్లైమాక్స్ ఎఫెక్టివ్ గా రావాలిసింది.

చివరగా :

“ఫిదా”కుటంబమంతా కలిసి చూడదగ్గ ఫీల్ గుడ్ ఎంటరై టైనర్