Asianet News TeluguAsianet News Telugu

"శతమానంభవతి" మూవీ రివ్యూ

  • చిత్రం : శతమానం భవతి
  • విడుదల తేదీ : జ‌న‌వ‌రి 14, 2017
  • దర్శకత్వం : వేగేశ్న సతీష్
  • నిర్మాతలు : దిల్‌రాజు
  • సంగీతం : మిక్కీ జే మేయర్
  • నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ
  • ఏషియానెట్ రేటింగ్-3.25/5
shatamanambhavathi review

కథ :

పిల్లలంతా పెరిగి పెద్దవారై విదేశాలకు వెళ్లిపోయినా పుట్టిన ఊరిమీద మమకారంతో సొంత ఊరు ఆత్రేయపురంలోనే భార్య జానకమ్మ(జయసుధ)తో కలిసి ఉండిపోతాడు రాజుగారు(ప్రకాష్ రాజ్). ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నా... ఎవరూ లేని వాళ్లలా ఒక్కరే ఊళ్లో ఉంటున్నందుకు రాజుగారు ఎప్పుడూ బాధ పడుతుంటారు. అయితే ఆ బాధ నుంచి కొంత ఓదార్పుగా మనవడు రాజు (శర్వానంద్) వారితోనే ఉంటుంటాడు. ఆ సమయంలో తన పిల్లలను చూడాలనుకున్న రాజుగారు వారిని సంక్రాంతి పండుగకు రప్పించేందుకు ఓ పథకం వేస్తాడు. అనుకున్నట్టుగా పిల్లలను మనవళ్లను సంక్రాంతికి ఇంటికి పిలిస్తాడు.

ఇలా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రాజుగారి మనవరాలు నిత్యా (అనుపమా పరమేశ్వరన్), రాజుతో ప్రేమలో పడుతుంది. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతుండగానే పిల్లలను ఇండియాకు రప్పించడం కోసం రాజుగారు వేసిన పథకం బయటికి తెలుస్తుంది. దీంతో రాజుగారి కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలకు కారణం ఏంటి..? రాజుగారు వేసిన ఆ పథకం ఏంటి..? ఇన్ని సమస్యల మధ్య రాజు, నిత్యా ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
హీరో శర్వానంద్ అయినా సినిమాలో ఎక్కువ భాగం రాజుగారి పాత్రలో నటించిన ప్రకాష్ రాజు చుట్టూనే తిరుగుతుంది. నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్, తనదైన నటనతో రాజుగారి పాత్రకు ప్రాణం పోశాడు. జానకమ్మగా సహజనటి జయసుధ హుందాగా కనిపించారు. ఇప్పటికే పలు చిత్రాల్లో కనువిందు చేసిన ప్రకాష్ రాజ్, జయసుధల జంట మరోసారి ఆకట్టుకుంది. రాజు పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. నిత్యా పాత్రలో అనుపమా పరమేశ్వరన్ శర్వాకు పోటీ ఇచ్చింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర లాంటి నటులు ఆకట్టుకున్నారు.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఫ్యామిలీ ఎమోషన్స్. ఎక్కడా అతికి పోకుండా కుటుంబమంతా ఆస్వాధించేలా ఆద్యంతం ఎమోషన్స్‌తో కట్టిపడేసేలా సన్నివేశాలను రాసుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కుటుంబ విలువల గురించి చెప్పే సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఫ్యామిలీ డ్రామా అయినా కూడా సినిమాలో వీలైనంత మేర కామెడీ ఉండేలా చూడడం కూడా ఓ ప్లస్ పాయింట్‌గానే చెప్పాలి. నరేష్ కామెడీ బాగా ఆకట్టుకుంది.

శర్వానంద్ తన స్టైల్లో ఎనర్జిటిక్‌గా బాగా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ తన పాత్రలో ఒదిగిపోయి నటించేసింది. వీరిద్దరి పెయిర్ చూడముచ్చటగా ఉండడంతో పాటు, ఇద్దరూ పోటీపడి నటించడంతో మంచి ఫీల్ వచ్చింది. ఇక ప్రకాష్ రాజ్, జయసుధలు తమ స్థాయికి తగ్గ నటన ప్రదర్శించారు. నరేష్, ఇంద్రజ ఇలా మిగతా తారాగణమంతా తమ పరిధిమేర బాగానే నటించారు. సినిమా సెకండాఫ్‌తో పోలిస్తే ఫస్టాఫ్ బాగా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

పెద్దగా ట్విస్ట్‌ లేమీ లేకుండా అన్ని ఫ్యామిలీ సినిమాల్లో కనిపించే కథనే చూస్తూ ఉన్నట్లనిపించడం మైనస్‌గానే చెప్పాలి. ఇక సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా లేకున్నా, ఫ్యామిలీ సినిమా ఫార్మాట్‌లో సాగిపోవడం కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. కొన్నిచోట్ల కావాలని ఇరికించిన కామెడీ సన్నివేశాలు అస్సలు ఆకట్టుకునేలా లేవు.

ఇక సెకండాఫ్‌లో సినిమా వేగం తగ్గడం కూడా మైనస్‌గానే చెప్పాలి. కథా అవసరానికి మించి నెమ్మదిగా నడుస్తూ అక్కడక్కడా సినిమా కాస్త బోర్ కొట్టించింది. ఇక రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాల్లోని అంశాలు ఈ సినిమాలో లేకపోవడం అలాంటి వాటినే కోరేవారిని నిరుత్సాహపరచే అంశం.


సాంకేతిక నిపుణులు :
కావాలని ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఇరికించకుండా అచ్చమైన కుటుంబ కథను వెండితెర మీద చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. ముఖ్యంగా కుటుంబ బంధాల విలువలు తెలిపేలా దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. తొలి భాగాన్ని బాగానే నడిపించిన సతీష్, సెకండాఫ్ విషయంలో మాత్రం కాస్త తడబడినట్టుగా అనిపించింది.
 

ముఖ్యంగా అనవసరంగా ఇరికించిన కామెడీ సన్నివేశాలతో పాటు, రొటీన్ ఫ్యామిలీ డ్రామాల్లో వచ్చే సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. ఈ తరహా చిత్రాలకు తన సంగీతం అయితే కరెక్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఎంతైనా దిల్ రాజు సినిమా.

 

చివరగా : ‘శతమానం భవతి’ కొత్తదనంతో కూడిన ఒక చక్కని కుటుంబ కథా చిత్రం

Follow Us:
Download App:
  • android
  • ios