బాలీవుడ్ స్టైలిష్ హీరో షాహిద్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షాహిద్ కపూర్ నటించిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో షాహిద్ కపూర్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు. షాహిద్ కపూర్ తాజాగా నేహాధూపియా హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిఎఫ్ఎఫ్ విత్ వోగ్ షోలో పాల్గొన్నాడు. 

ఈ షోలో షాహిద్ కపూర్ మాజీ ప్రియురాళ్లు ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ గురించి నేహా ధూపియా ప్రశ్నించింది. గతంలో ఈ స్టైలిష్ హీరోతో వీరిద్దరూ ఘాటు రొమాన్స్ లో మునిగితేలారు. కరీనా కపూర్ వివాహానికి మీరెందుకు వెళ్ళలేదు అని నేహా ధూపియా ప్రశ్నించింది. దీనికి షాహిద్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఆమె నన్ను పెళ్ళికి పిలవలేదు. ఆ సమయంలో కరీనా కపూర్ వివాహం జరుగుతున్నట్లు కూడా నాకు తెలియదు అని షాహిద్ తెలిపాడు. 

కానీ మరో మాజీ గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక చోప్రా వివాహానికి మాత్రం షాహిద్ కపూర్ హాజరయ్యాడు. దీపికా, రణవీర్ సింగ్ ఇద్దరిలో మీకు మంచి కోస్టార్ ఎవరని ప్రశ్నించగా దీపికా అని షాహిద్ కపూర్ సమాధానం ఇచ్చాడు. పద్మావత్ చిత్రంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.