సీనియర్ దర్శక నిర్మాత, రచయిత యు. విశ్వేశ్వరరావు తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పటిల్ లో చికిత్స పొందతూ నేడు మరణించారు. 


సీనియర్ నటులు, దర్శక నిర్మాతల పాలిట కరోనా యమపాశంలా మారింది. రోజుల వ్యవధిలో కరోనా కారణంగా పలువురు ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. కోలీవుడ్ లో ఈ మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. తాజాగా సీనియర్ దర్శక నిర్మాత, రచయిత యు. విశ్వేశ్వరరావు తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పటిల్ లో చికిత్స పొందతూ నేడు మరణించారు. 

యు.విశ్వేశ్వరరావు ఎన్టీఆర్‌ కుటుంబానికి బంధువు. ఎన్టీఆర్ కి ఆయన వియ్యంకుడు వరుస అవుతారు. ఈ సాన్నిహిత్యంతో ఎన్టీఆర్ తో ఆయన అనేక సినిమాలు నిర్మించడం జరిగింది. ఎన్టీఆర్ హీరోగా కంచుకోట, నిలువు దోపిడీ, దేశోద్థారకులు, పెత్తందార్లు చిత్రాలను నిర్మించారు. దర్శకుడిగా తీర్పు, మార్పు, నగ్న సత్యం, కీర్తి కాంతా కనకం, పెళ్లిళ్ల చదరంగం చిత్రాలను రూపొందించారు. 


 రంగస్థల నటుడు, నాటక రచయితగా విశ్వేశ్వర రావు ప్రస్థానం మొదలైంది. . ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు కథను సమకూర్చుకున్నదీ ఆయనే. విశ్వేశ్వరరావు మంచి గేయ రచయిత కూడా. దేశోద్థారకులు చిత్రంలో ఆకలై అన్నమడిగితే పిచ్చోళ్లు అన్నారు నాయాళ్లు... పాట రాసింది ఆయనే! నగ్నసత్యం, హరిశ్చందుడ్రు చిత్రాలకు ఆయన జాతీయ పురస్కారాలు అందుకోగా, కీర్తి కాంతా కనకం, పెళ్లిళ్ల చదరంగం చిత్రాలకు రెండు నందులను సొంతం చేసుకున్నారు. 17వ నేషనల్‌ అవార్డ్‌ సెంట్రల్‌ జ్యూరీ మెంబర్‌గా ఉండడమే కాకుండా సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శిగా కూడా పనిచేశారు. విశ్వేశ్వరరావు మృతి పట్ల చిత్ర పరిశ్రమ త్రీవ దిగ్ర్భాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.