ప్రముఖ సీనియర్ నటి వాణిశ్రీ తెలుగు తమిళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజ నటులతో ఆమె అద్భుతమైన చిత్రాల్లో నటించారు. కాగా ఇటీవల మహానటి చిత్రం గురించి వాణిశ్రీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దిగ్గజ నటి సావిత్రి జీవిత చరిత్రగా గత ఏడాది విడుదలైన మహానటి చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించింది. 

సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కానీ వాణిశ్రీ మాత్రం భిన్నంగా స్పందించింది. 'మహానటి సినిమా చూస్తూ సెకండ్ హాఫ్ లో లేచి వెళ్ళిపోయా' అని వాణిశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సావిత్రి జీవితంలో అలాంటి సంఘటనలేవి జరగలేదు. మహానటి చిత్రం వాస్తవికతకు దూరంగా ఉందని వాణిశ్రీ విమర్శించారు. 

మీ బయోపిక్ కూడా వెండి తెరపైకి రావాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించగా.. అనూహ్యమైన మలుపులు, వివాదాలు ఉండే సెలెబ్రిటీల బియోపిక్స్ మాత్రమే ప్రేక్షకులు కోరుకుంటారు. నా జీవితంలో అలాంటి సంఘటనలేవి జరగలేదని వాణిశ్రీ తెలిపారు.