సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ హైదరాబాద్ విచ్చేశారు.  ఫిక్కీ ఫ్లో ఆర్గనైజేషన్‌ ‘ది పవర్‌ ఆఫ్‌ పాజిటివిటీ’ పేరుతో హోటల్‌ ఐటీసీ కాకతీయలో 2020–21 వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనుపమ్ ఖేర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 27ఏళ్ల ప్రాయంలో సినిమాపై మక్కువతో ముంబై వచ్చిన అనుపమ్... చిన్న చిన్న పనులు చేస్తూ, ఫ్లాట్ ఫార్మ్స్ పై నిద్రించేవాడట. మహేష్ భట్ తనకు సినిమాలలో అవకాశం ఇచ్చేవరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆయన చెప్పారు. 


ఇక భారతీయులు సినిమాను లార్జర్ దెన్ లైఫ్ గా భావిస్తారన్న ఆయన, భారతీయ నటులు భిన్న కోణాలలో నటించగలరు అన్నారు. లండన్ లో బాహుబలి సినిమా చూశాను, దానిని నేను తెలుగు సినిమాగా చూడను, ఇండియన్ సినిమాగానే భావిస్తాను అన్నారు. చాలా కాలం తరువాత తెలుగు చిత్రం కార్తికేయ 2లో నటిస్తున్నట్లు తెలియజేశారు. 


జీవితంలో ప్రతినిమిషం ఆనందంగా గడపడానికి, కొత్తవారిని కలవడానికి ఇష్టపడతానని అనుపమ్ తెలియజేశారు. ఇప్పటికే మూడు పుస్తకాలు రాశానని, కోవిడ్ వంటి దుర్భర పరిస్థితులలో ఆశావాదం రేకెత్తించేలా 'యువర్ బెస్ట్ డే ఈజ్ టుడే' అనే పుస్తకం రాసినట్లు తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ ఫ్లో చైర్‌పర్సన్‌ ఉషారాణి మన్నె, పింకీ రెడ్డి, అపూర్వ జైన్, రేఖారెడ్డి తదితరులు పాల్గొన్నారు.