`స్కంద`లో సత్యం స్కామ్..?
`స్కంద` చిత్రంలో రామకృష్ణరాజు ఎపిసోడ్ ఆశ్చర్యపరుస్తుంది. ఇది పదిహేనేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన `సత్యం స్కామ్`కి దగ్గరగా ఉందని అంటున్నారు.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో `స్కంద` చిత్రం రూపొందింది. యంగ్ సెన్సేషన్ శ్రీలీల, సాయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం నేడు గురువారం విడుదలైంది. బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్లతో రూపొందిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమాలో బోయపాటి శ్రీను చూపించిన అంశాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పుడు ఆయా ఎలిమెంట్లని బోయపాటి ఎందుకు టచ్ చేశారనేది హాట్ టాపిక్ అవుతుంది.
సినిమాలో శ్రీకాంత్ ఐటీ దిగ్గజం రామకృష్ణరాజు పాత్రలో కనిపించాడు. చాలా దేశాల్లో ఆయన కంపెనీ రన్ అవుతుంది. ఎంతో గుడ్ విల్ ఉంటుంది. ఏకంగా ప్రధానితోనే టచ్ లో ఉంటారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి తమ బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు రామకృష్ణరాజు సంస్థని ఎంచుకుంటాడు. ఈ విషయంపై ఆయన్ని అప్రోచ్ అవగా, అందుకు ఒప్పుకోని రామకృష్ణరాజు ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తారు. కంపెనీలో అవకతవకలు జరిగాయని, తన ఎంప్లాయిస్ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఆరోపించి కంపెనీ మూసేయిస్తారు. ఆయన్ని జైల్లో పెట్టిస్తారు. తప్పు ఒప్పుకునేలా బ్లాక్ మెయిల్ చేసి ఉరి శిక్ష పడేలా చేస్తారు.
ఈ క్రమంలో జైల్లో ఉన్న శ్రీకాంత్ పాత్రని ఉద్దేశించి, పరిస్థితులకు తలవంచి తప్పుచేశానని మీరు ఒప్పుకోవచ్చు, ఆ చట్టం ఒప్పుకోవచ్చు, ఆ ధర్మం ఒప్పుకోవచ్చు, కానీ ఆ దైవం ఒప్పుకోదు సర్`, అలాగే ఇద్దరు సీఎంలకు వార్నింగ్ ఇస్తూ రామ్ చెప్పే ` మనిషికో పేరు, ఊరికో గౌరవం, ప్రతి పదవికీ ఓ బాధ్యత ఉంటుంది. అది మరిచిపోయి మీరు ఇద్దరూ తీసిన పరువు, కూల్చేసిన ఆత్మగౌరవం తిరిగి మీరే నిలబెట్టాలి` అని డైలాగులు థియేటర్‌లో బాగా పేలాయి. చాలా వరకు ప్రస్తుతం రాజకీయాలను అద్దం పట్టేలా బోయపాటి ఇందులో డైలాగులు, సీన్లు పెట్టాడని అంటున్నారు.
అయితే ఇందులో రామకృష్ణరాజు ఎపిసోడ్ ఆశ్చర్యపరుస్తుంది. ట్రైలర్‌ని బట్టి ఇది ఏపీ రాజకీయాలకు సంబంధించినదిగా భావించారు. కానీ సినిమాలో మరో ఎలిమెంట్‌ని టచ్ చేశారని, ఇది పదిహేనేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సత్యం రామలింగరాజు స్కామ్‌కి దగ్గరగా ఉందని, ఆయా అంశాలనే శ్రీకాంత్ పాత్ర ద్వారా చర్చించి ఉంటారని భావిస్తున్నారు. `సత్యం స్కామ్` విషయంలో అప్పటి ప్రభుత్వం అక్రమంగా `సత్యం` కంప్యూటర్స్ అధినేత బైర్రాజు రామలింగరాజుని ఇరికించిందనే అర్థం వచ్చేలా బోయపాటి ఇందులో చూపించారని అంటున్నారు. అదే సమయంలో డైలాగులు మాత్రం ఏపీ మాజీ సీఎం చంద్రబాబు జైల్లో పెట్టిన సంఘటనలను తలపించేలా ఉన్నాయని చెబుతున్నారు.
మొత్తంగా ఇప్పుడు `సత్యం స్కామ్` అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ఆ విషయాలను ఇందులో ఎందుకు డిస్కస్ చేశాడనేది పెద్ద ప్రశ్న. కథా వస్తువుగానే దాన్ని తీసుకున్నాడా? లేక ప్రస్తుతం జైల్లో ఉన్న చంద్రబాబుకి, వైఎస్‌కి, ఆ స్కామ్‌కి లింక్ ఉందనే విషయాన్ని బోయపాటి చెప్పాలనుకున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే కథ నేపథ్యంలో కోసం బోయపాటి ఈ అంశాలను తీసుకున్నా? ఆయా సీన్లు ప్రత్యక్షంగా `సత్యం స్కామ్` కి సంబంధించినదే అంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.
మరి సత్కం స్కామ్ గురించి చూస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో సత్యం స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆయన కంపెనీలో అవకతవకలు జరిగినట్టు ఆడిటింగ్‌లో గుర్తించారు. అందులో పెద్ద మోసం ఉందని, ఎన్నో బోగస్ కంపెనీలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో సత్యం రామలింగరాజుని అరెస్ట్ చేశారు. కొన్నాళ్లపాటు `సత్యం స్కామ్` స్టేట్ మొత్తాన్ని కుదిపేసింది. ఆ తర్వాత సత్యం కంప్యూటర్స్ ని టెక్ మహింద్రా తమ వశం చేసుకుంది. దీంతోపాటు చాలా కుంభకోణాలు ఆ సమయంలో వెలుగులోకి వచ్చాయి. అది `సత్యం` రామలింగరాజుకి, చంద్రబాబుకి సంబంధం ఉందని, రామలింగరాజు ఎదగడంలో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉందనే ప్రచారం జరిగింది. ఈ కారణంగానే వారిని దెబ్బ కొట్టేందుకు వైఎస్‌ఆర్ ఈ ప్లాన్ చేసినట్టు ప్రచారం జరిగింది. మరోవైపు చంద్రబాబే తెరవెనుక ఇదంతా చేయించాడనే కామెంట్స్ కూడా ఉన్నాయి. మరి ఏది నిజమో ఏమో అప్పట్లో పెద్ద దుమారం రేపిన ఈ స్కామ్ కి సంబంధించిన అంశాలు `స్కంద`లో చూపించిన విషయాలు దగ్గరగా ఉండటం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అవుతుంది.