నటుడు సంజయ్ దత్ ఇటీవల అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రాగా ముంబైలోని ప్రఖ్యాత లీలావతి హాస్పిటల్ లో అడ్మిట్ కావడం జరిగింది. ముంబైలో కోవిడ్ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో సంజయ్ కోవిడ్ బారినపడ్డారని కథనాలు రావడం జరిగింది. ఐతే ఆ తదుపరి రోజు సంజయ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఆసుపత్రి వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం సంజయ్ దత్ క్యాన్సర్ బారినపడ్డారట. ఆయనకు లంగ్ కాన్సర్ సోకగా, అది కూడా మూడవ దశలో ఉందని వారి వాదన.  


సంజయ్ దత్ తాజా ట్వీట్ లో తాను వర్క్ కి బ్రేక్ ఇచ్చి, చికిత్స కోసం అమెరికా వెళుతున్నట్లు వెల్లడించారు. అలాగే ఫ్యామిలీ తన వెంటే ఉందన్న సంజయ్ దత్ చికిత్స అనంతరం తిరిగి వస్తాను అన్నారు. అలాగే అనవసరమైన పుకార్లు నమ్మవద్దని కూడా ఆయన చెప్పడం ఈ ప్రచారానికి బలం చేకూర్చుతుంది. సడన్ గా సంజయ్ అమెరికాలో చికిత్స తీసుకోవాల్సిన అంతటి పెద్ద సమస్య ఏమై ఉంటుందని బాలీవుడ్ వర్గాలలో అనుమానాలు మొదలయ్యాయి.

మరో వైపు ప్రతిష్టాత్మక కెజిఎఫ్ 2లో సంజయ్ దత్ ప్రధాన విలన్ అధీరా పాత్ర చేస్తున్నారు. ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలి ఉండగా, సంజయ్ పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ మిగిలివుంది. ఈ సమయంలో ఆయనకు క్యాన్సర్ సోకిందన్న వార్తలు కెజిఎఫ్ 2 మేకర్స్ ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే సంజయ్ కెజిఎఫ్ 2 షూటింగ్ లో తిరిగి పాల్గొనగలడా అనే అనుమానం వారిలో మొదలైంది. ఈ చిత్ర విడుదల తేదీగా అక్టోబర్ 23ను ప్రకటించడగా, మిగిలిన షూటింగ్ పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధం అవుతుంది.