సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బిజీ కానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ ని త్వరలో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా మహేష్ తదుపరి చిత్రాల జాబితాలో దర్శకులు ఎక్కువగానే ఉన్నారు. అర్జున్ రెడ్డి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్ వంగ కూడా మహేష్ తో ఓ చిత్రం చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ కాంబినేషన్ గురించి మీడియాలో వార్తలు రావడమే కానీ అధికారికంగా ఎవరూ స్పందించలేదు. మహేష్ తో సినిమాపై తొలిసారి సందీప్ వంగ స్పందించాడు. మహేష్ కు ఇప్పటికే కొంత భాగం కథ వినిపించాయి. పూర్తి కథ సిద్ధం చేసి వినిపించాలి. ఏం జరుగుతుందో చూడాలి అని సందీప్ తెలిపాడు. 

సందీప్ వంగ పూర్తి కథతో మహేష్ ని మెప్పిస్తే క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధం అయినట్లే. ప్రస్తుతం సందీప్ వంగ హిందీలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కబీర్ సింగ్ పేరుతో హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ తెరకెక్కుతోంది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఈ నెల 21న కబీర్ సింగ్ చిత్రం విడుదల కానుంది.