అక్కినేని అఖిల్ హీరోగా తొలి విజయం మరోమారు వాయిదా పడింది. ఈ ఏడాది విడుదలైన మిస్టర్ మజ్ను చిత్రం కూడా అఖిల్ కు నిరాశనే మిగిల్చింది. దీనితో అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు పరాజయం చెందినట్లయింది. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. 

గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అక్కినేని హీరో భారీ ఆశలే పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దర్శకుడు నటీనటుల ఎంపిక ప్రక్రియలో బిజీగా ఉన్నాడు. తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అఖిల్ కు తండ్రిగా ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ఎంపికైనట్లు తెలుస్తోంది. 

తెలుగులో తండ్రి పాత్రలకు రావు రమేష్ తరహాలో తమిళంలో సముద్రఖని పాపులర్ అయ్యారు. రఘువరన్ బీటెక్ చిత్రంలో సముద్రఖని ధనుష్ కు తండ్రిగా నటించిన సంగతి తెలిసిందే. సముద్రఖని క్రమంగా అద్భుతమైన పాత్రలు సొంతం చేసుకుంటున్నాడు.రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.