సంపూ 'మార్టిన్ లూథర్ కింగ్' కలెక్షన్స్ అంత దారుణమా?
ఇది ఒక సందేశాత్మక చిత్రం, సమకాలీన రాజకీయాలొ ఓటు గురించి, దాని బలం, విలువ గురించి వినోదాత్మకంగా ఎక్కడా విసుగు అనిపించకుండా చెప్పే సందేశాత్మక చిత్రం.

తమిళ స్టార్ కమేడియన్ యోగిబాబు(Yogibabu)హీరో గా వచ్చిన సూపర్ హిట్ మూవీ మండేల(Mandela). మడోన్నే అశ్విన్(Madonne ashwin) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి అద్బుతమైన రెస్పాన్ వచ్చింది. ఒక చిన్న గ్రామంలో జరిగే ఒక క్షురకుడి కథే మండేలా. కామెడీగా సాగుతూనే ఎమోషన్ ను పండించిన ఈ సినిమాలో యోగిబాబు నటనకు అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ అవార్డు విన్నింగ్ పాత్రలో టాలీవుడ్ నటుడు సంపూర్ణేశ్ బాబు(Sampoornesh Babu) నటిస్తుంచాడు. మండేలా సినిమాను తెలుగులో రీమేక్ చేసి రిలీజ్ చేసారు.
మార్టిన్ లూథర్ కింగ్(Martin Luther King) అనే టైటిల్తో వచ్చిన ఈ సినిమాకు పూజా కొల్లూరు దర్శకత్వం వహించగా..కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా స్క్రీన్‌ప్లే, మాటలు రాసి.. పూజ కొల్లూరును దర్శకురాలిగా పరిచయం చేసారు. ఎలక్షన్స్ కు ..ఓటుకు నోటుతో సంబంధం ఉందనే భావనను ఇందులో చూపించారు. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య నడిచే ఎలక్షన్స్ ను సరికొత్త పంథాలో చూపించారు డైరెక్టర్. ఈ చిత్రానికి మంచి రివ్యూలే వచ్చాయి. అయితే కలెక్షన్స్ మాత్రం అనుకున్న స్దాయిలో రావటం లేదు. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కేవలం ₹ 0.53 కోట్లు మాత్రమే తెచ్చుకుందని ట్రేడ్ వర్గాల సమాచారం. బడ్జెట్ 8 కోట్లు దాకా పెట్టారని వినికిడి. ఇది ఒక సందేశాత్మక చిత్రం, సమకాలీన రాజకీయాలొ ఓటు గురించి, దాని బలం, విలువ గురించి వినోదాత్మకంగా ఎక్కడా విసుగు అనిపించకుండా చెప్పే సందేశాత్మక చిత్రం. ఆలోంచింపచేసే చిత్రం 'మార్టిన్ లూథర్ కింగ్' కలెక్షన్స్ కూడా బాగుంటే మరిన్ని ఇలాంటి సినిమాలు తీయటానికి ఉత్సాహం వస్తుంది.
చిత్రం కథేమిటింటే....పడమర పాడు అనే గ్రామంలో అమాయకుడైన స్మైల్ (సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టి జీవిస్తూంటాడు. అతను ఒంటరి, మర్రి చెట్టు అతడి నివాసం.వూర్లో అందరూ అతన్ని ఎడ్డోడా, వెర్రిబాగులోడా అని పిలుస్తూ వాళ్ళ ఇళ్లల్లో పనులు చేయించుకుంటూ వాళ్ళకి తోచిన చిల్లర డబ్బులు ఇస్తూ వుంటారు. డబ్బులు కూడబెట్టి చెప్పుల షాపు తెరవాలని అతడి కల. ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారు. ఇలాకాదని, డబ్బు పోస్టాఫీసులో దాయాలని, స్నేహితుడు పోస్టాఫీసులో ఖాతా తెరిపించడానికి తీసుకుపోతాడు. కొత్త పోస్టు మాస్టర్ వసంత (శరణ్యా ప్రదీప్) ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అడుగుతుంది. అవి లేవు. తల్లిదండ్రులేం పేరు పెట్టారో గుర్తు లేదు. వూళ్ళో నోటికొచ్చిన తిట్టుతో తనని పిలుస్తోంటే అసలు పేరు మర్చిపోయాడు. చూస్తే చిరునవ్వుతో వున్నట్టు కన్పిస్తాడు కాబట్టి, కొందరు స్మైల్ అని పిలవడం మొదలెట్టారు. పేరే లేకపోతే ఐడీ కార్డు కూడా రాదు. అందుకని వసంత బాగా ఆలోచించి, అతడికి మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెట్టేస్తుంది. వెళ్ళి ఆ పేరుతో ఆధార్ కార్డు తెచ్చుకోమంటుంది. అలా ఖాతా ఓపెన్ అవుతుంది. ఇంకా ఈ దిక్కుమాలిన వాడికి ఆధార్ కార్డు ఆధారంగా ఓటర్ ఐడీ కార్డు కూడా రావడంతో గ్రామంలో సంచలనం రేగుతుంది.
ఈలోగా పడమరపాడుకి ప్రెసిడెంట్ ఎన్నికలు వస్తాయి, అందులో దక్షిణ దిక్కు నుండి లోకి (వెంకటేష్ మహా) వుత్తరం దిక్కు నుండి జగ్గు (వికె నరేష్) పోటీలో పాల్గొంటారు. ఈ ఇద్దరూ వరసకి అన్నదమ్ములు, ఒకే తండ్రికి పుట్టిన వాళ్లే కానీ తల్లులు వేరు, కానీ ఈ ఇద్దరికీ పడదు. ఇద్దరూ ఎన్నికల్లో ప్రచారాలు చేస్తూ, సర్వే కూడా చేస్తారు, ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒక్క ఓటు ఎలా దొరుకుతుందా అని ఇద్దరూ తాపత్రయపడుతూ వున్న సమయంలో, మార్టిన్ లూథర్ కింగ్ కి ఓటు హక్కు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రెసిడెంట్ పదవితో పాటు 30 కోట్ల ప్రాజెక్ట్ ఆ వూరికి వస్తుంది అని లోకల్ ఎంఎల్ఏ చెప్పడంతో, ఆ ఒక్క ఓటు కోసం ఇద్దరూ తాపత్రయ పడతారు. ఓటు హక్కు రావటంతో మార్టిన్ లూథర్ కింగ్ జీవితం ఎలా మారిపోయింది, అలాగే జగ్గు, లోకి ల వలన అతనికి ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి, ఓటు ఎంత బలమైంది దానితో వూరునే ఎలా మార్చవచ్చు అన్నది మిగతా కథ. ఎలక్షన్స్ అధికారిణి పాత్రలో నటించిన శరణ్య ప్రదీప్ నటన ఆకట్టుకుంటోంది.
ఈ మూవీలో సీనియర్ హీరో నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహాయాన మోషన్ పిక్చర్స్, ఏపీఐ ఫిల్మ్స్ పతాకాలపై ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, శిబాశిష్ సర్కార్, ఎల్. వేణుగోపాల్ తదితరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. స్మరణ్ సాయిసాంగ్ సంగీతం అందించాడు.