మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీగా తెరకెక్కుతున్న చిత్రం -సైరా నరసింహారెడ్డి. స్టైలిష్ డైరక్టర్  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ  సినిమాకు సంభందించిన ఓ కొత్త అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. ఈ అప్డేట్ తో సినిమాకు స్పెషల్ క్రేజ్ వస్తుందా అని చర్చలు చేస్తున్నారు.

ఇంతకీ ఆ అప్డేట్ ఏమిటీ అంటే... ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీతం  సమకూరుస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరొకరు అందిస్తున్నారు. ఆయనే జూలియస్‌ పేకియమ్‌! హిందీ చిత్ర పరిశ్రమలో బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ స్పెషలి‌స్టగా ఈయనకు మంచి పేరుంది. సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘ఏక్‌ థా టైగర్‌’, ‘కిక్‌’, ‘భజరంగీ భాయిజాన్‌’, ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’, తాజా ‘భారత్‌’ చిత్రాలకు, అలాగే ‘ధూమ్‌ 3’, ‘బాఘీ’ సిరీస్‌కు జూలియస్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. 

‘భారత్‌’ చిత్రానికి ఆయన అందించిన బ్యాక్ గ్రైండ్ స్కోర్ రామ్‌చరణ్‌కు నచ్చడంతో ‘సైరా’కు తీసుకున్నారట! జూలియస్ ని సల్మాన్ ఖాన్ ...రికమెండ్ చేసాడని, బాలీవుడ్ మార్కెట్ కు ఈ మార్పు అవసరమని సూచించాడట. ఇక  ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.

రామ్‌చరణ్ నిర్మాతగా సైరా 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమా విడుదల చేయనున్నారు. తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న సినిమా అత్యంత భారీస్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.