లాక్‌ డౌన్‌ కారణంగా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు అన్ని నిలిచిపోవటంతో సెలబ్రిటీలు ఇతర వ్యాపకాలతో బిజీ అవుతున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా తన ఫాంలో బిజీగా కాలం గడుపుతున్నాడు. అక్కడి నుంచే తన బిజినెస్ వ్యవహారాలతో పాటు సినిమా పనులు కూడా చక్క బెట్టేస్తున్నాడు. అంతేకాదు వరుసగా వీడియో సింగిల్స్‌ను రిలీజ్‌ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నాడు సల్మాన్‌.

తాజాగా తన ఫాంలోని పొలంలో నాట్లు వేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చాడు సల్మాన్‌ ఖాన్. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు సల్మాన్‌. ఈ వీడియోలో సల్మాన్‌తో పాటు ఆయన గర్ల్‌ ఫ్రెండ్‌ లులియా వాంతూర్‌ కూడా ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. పని పూర్తి అయిన తరువాత ఓ బోర్‌ దగ్గర తన ఒంటికి అంటిన మట్టిని కడుగుతూ కనిపించాడు సల్మాన్‌.

ఈ వీడియోతో పాటు వరి నాట్లు వేయటం పూర్తయ్యింది అంటూ కామెంట్ చేశాడు సల్మాన్‌ భాయ్. ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్‌ ప్రస్తుతం రాథే యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్‌ సినిమాలో నటిస్తున్నాడు. దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉన్నా.. లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.