మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రమాదానికి గురయ్యారు. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
కోలీవుడ్ సూపర్ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ షూటింగ్ సెట్స్ లో ప్రమాదం బారిన పడ్డారు. విలాయత్ బుద్ధ టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కుతుండగా పృథ్విరాజ్ హీరో. కేరళ ఆర్టీసీ బస్సులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా పృథ్విరాజ్ బస్సులో నుండి జారిపడ్డారు. ఆయన కాలికి తీవ్ర గాయమైంది. మరయూర్ బస్ స్టాండ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే పృథ్విరాజ్ ని కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
పరీక్షలు నిర్వహించిన వైద్యులు సర్జరీ చేయాలని సూచించారు. నేడు పృథ్విరాజ్ కాలికి సర్జరీ చేయనున్నారట. మూడు నెలల పాటు ఆయన బెడ్ రెస్ట్ తీసుకోవాలని తెలుస్తుంది. ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన పృథ్విరాజ్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

పృథ్విరాజ్ సలార్ మూవీలో మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన పోర్షన్ మిగిలి ఉంటే ఇబ్బందులు తప్పవు. సలార్ విడుదలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. పృథ్విరాజ్ షూటింగ్ లో పాల్గొనే పరిస్థితి లేదు. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సినిమా విడుదల ఆలస్యం అవుతుందని ఊహాగానాలు రాగా, యూనిట్ కొట్టిపారేశారు.
