ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా  కే నాయుడు సోదరుడు, శ్యామ్ కే నాయుడు తనను మోసం చేశాడంటూ సాయి సుధా అనే ఆర్టిస్ట్‌ కేసు వేసిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తనను శారీరకంగా వాడుకున్నాడంటూ కొద్ది రోజుల క్రితం సాయి సుథ ఎస్‌ ఆర్‌ నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో విచారన జరిపిన పోలీసులు శ్యామ్‌ కే నాయుడుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అయితే అరెస్ట్ అయిన రెండు రోజులకే శ్యామ్ కే నాయుడు బెయిల్ మీద విడుదల అయ్యాడు. తాను సాయి సుథతో కోర్టు వెలుపల కాంప్రమైజ్‌ అయినట్టుగా పత్రాలు సమర్పించటంతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం ఆ పత్రాల విషయంలోనే వివాదం మొదలైంది. తాను ఎలాంటి కాంప్రమైజ్‌కు అంగీకరించలేదని, శ్యామ్‌ కే నాయుడు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి బెయిల్ పిటీషన్‌ వేసినట్టుగా సాయి సుధ ఆరోపిస్తోంది.

దీంతో బెయిల్ పిటీషన్‌ సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించింది. ఫోర్జరీ సంతకం పెట్టి, బెయిల్ కు తాను ఒప్పుకున్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించాడని ఆమె కోర్టుకు తెలిపింది. ఈ విషయంపై విచారణ జరిపిన న్యాయస్థాయం శ్యామ్‌ కే నాయుడుకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పోలీసులు ఫోర్జరీ సంతకంతో కోర్టును తప్పుదోవ పట్టించినందుకు శ్యామ్‌ కే నాయుడుపై మరో కేసు నమోదు చేశారు.