మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన  'అతడు' సినిమా అప్పట్లో మంచి హిట్ అయ్యింది. ముఖ్యంగా ఆ సినిమాలో డైలాగులు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూంటాయి. పల్లెటూళ్లో చిన్నస్దాయి విలన్ గా కనిపించే తణికెళ్ల భరణి ...తనదైన శైలిలో ..యాసలో చెప్పే డైలాగులు అయితే చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరో సారి అలాంటి మ్యాజిక్ రిపీట్ కాబోతోందని వినికిడి. 

మహేష్  బాబు ఫ్యాన్స్  మాత్రమే కాక సినిమా లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ  'మహర్షి'.  ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, 'దిల్' రాజు, ప్రసాద్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేశ్ కిది 25వ చిత్రం కావడంతో ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించడమే కాకుండా.. ప్రతీ విషయంలోనూ ఫ్రెష్‌నెస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దాంతో ఈ సినిమాకు సంబంధించి.. ప్రతీ రోజు ఏదో ఒక వార్త  బయటకు వస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఒక కొత్త విషయం  వినిపిస్తోంది. అదేమిటంటే... ‘మహర్షి’ సినిమాలో సాయికుమార్‌ విలన్‌గా నటిస్తున్నారని సమాచారం.  ‘సామాన్యుడు, ప్రస్థానం, ఎవడు’ చిత్రాల్లో ఆయన విలనిజమ్‌కి మంచి మార్కులు పడ్డాయి.

‘ఎవడు’ చిత్రానికి కూడా వంశీ పైడిపల్లియే దర్శకుడనే విషయం తెలిసిందే. ఆ చిత్రంలో సాయికుమార్‌ పాత్ర అద్భుతంగా ఉంటుంది.  ఇప్పుడు ‘మహర్షి’లో కూడా విలేజ్ లో కనపడే విభిన్నమైన విలన్  పాత్ర డిజైన్‌ చేసారని తెలుస్తోంది.  సాయికుమార్ పాత్రకు ఓ డిఫరెంట్ మ్యానరిజం పెట్టారని, ఆయన కోసం రాసిన డైలాగులు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. రెగ్యులర్ గా ఉండే సాయికుమార్ ఆహార్యం కూడా ఈ సినిమాలో పూర్తిగా మారిపోతుందిట. అతడు లో తణికెళ్ల భరణిలాంటి పాత్ర అంటున్నారు. 

'మహర్షి' సినిమాలో మహేశ్ బాబుకి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో అల్లరి నరేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైన షెడ్యూల్‌ నెలరోజుల పాటు సాగుతుంది. అక్కడ మహేశ్‌, అల్లరి నరేశ్‌ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వేసవి కానుకగా ఈ సినిమా ఏప్రిల్‌ 5 న విడుదల కానున్న విషయం తెలిసిందే.