ఆర్ఎక్స్ 100 సినిమాతో ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న కార్తికేయ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. చేసిన ప్రతి సినిమా అందరిని ఆకట్టుకునేలా ఉండాలని కొన్ని కథలను లైన్ లో పెట్టిన కార్తికేయ ప్రస్తుతం ద్విభాషా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. 

మొత్తానికి నేడు ఈ యువ హీరో తెలుగు తమిళ్ లో ఒకేసారి హిప్పీ అనే సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశాడు. టిఎన్.కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. 2006లో ఈ డైరెక్టర్ జ్యోతిక - సూర్య లతో నువ్వు నేను ప్రేమ అనే సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక కార్తికేయ తో చేస్తోన్న సినిమా కూడా మంచి ప్రేమకథ అని తెలుస్తోంది. 

కబాలి సినిమాను నిర్మించిన కలైపులి ఎస్ థను సినిమాను నిర్మిస్తుండగా నివాస్ ప్రసన్న సంగీతం అందించనున్నారు. స్టార్ టెక్నీషియన్స్ తో కార్తికేయ మొదటిసారి నటిస్తుండడం అతని కెరీర్ కు హిప్పీ సినిమా కూడా మంచి బూస్ట్ ఇస్తుందని చెప్పవచ్చు.