రివ్యూ: Rx 100

'అర్జున్ రెడ్డి' రేంజ్ లో ఇంపాక్ట్ చూపించాలని అనుకున్నారు కానీ ఎమోషనల్ గా మాత్రం కథను డీల్ చేయలేకపోయారు. అందువల్ల ఈ సినిమా కొందరికి మాత్రమే నచ్చుతుంది. 

Rx 100 movie telugu review

నటీనటులు: కార్తికేయ, పాయల్ రాజ్ పుత్, రాంకీ, రావు రమేష్ తదితరులు 
సంగీతం: చేతన్ భరద్వాజ్ 
సినిమాటోగ్రఫీ: రామ్ 
నిర్మాత: అశోక్ రెడ్డి 
దర్శకత్వం: అజయ్ భూపతి

అప్పటివరకు ఎలాంటి హైప్ లేని 'Rx 100' అనే సినిమాకు పోస్టర్లు, ట్రైలర్లతో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్ లో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండడం, లెక్కలేనన్ని లిప్ కిస్ సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయని హీరోయిన్ బోల్డ్ గా చెప్పడంతో యూత్ అందరూ కూడా ఈ సినిమా చూడడానికి ఆసక్తిగా ఎదురుచూశారు. అమెరికాలో కూడా ఈ సినిమాకు మామూలు క్రేజ్ రాలేదు. మరి ఈరోజు విడుదలైన ఈ సినిమా అంచనాలను ఎంతవరకు రీచ్ అయిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
శివ(కార్తికేయ) చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోతాడు. దీంతో అతడ్ని డాడీ(రాంకీ) అనే వ్యక్తి పెంచి పెద్ద చేస్తాడు. డాడీ అంటే శివకు ప్రాణం. ఊరి పెద్ద విశ్వనాథం(రావు రమేష్) వద్ద డాడీ సహాయకుడిగా పని చేస్తుంటాడు. విశ్వనాథం, డాడీల వ్యవహారాలు చూసుకుంటూ కాలం గడుపుతుంటాడు శివ. అలాంటి శివ జీవితంలోకి ఇందు(పాయల్ రాజ్ పుత్) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. ప్రెసిడెంట్ కూతురు అయిన ఇందు చదువు పూర్తి చేసుకొని సెలవుల కోసం ఇంటికి వస్తుంది. శివను చూసి ఇష్టపడిన ఇందు ఆలస్యం చేయకుండా తన ప్రేమ విషయం శివకు చెబుతుంది. ఈ ప్రేమ వ్యవహారాన్ని పడక గది వరకు లాగుతుంది. సడెన్ గా ఇందుకి పెళ్లి చేసి అమెరికా పంపించేస్తాడు ఆమె తండ్రి. తన ప్రేయసి కోసం మూడేళ్ల పాటు ఆమె ఇంటి దగ్గరే ఎదురుచూస్తుంటాడు శివ. కానీ ఆమె మాత్రం అమెరికా నుండి తిరిగిరాదు. శివ ముఖం చూడాలని కూడా అనుకోదు. దానికి అసలు కారణం ఏంటి..? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మరొకరి భార్య అని తెలిసి కూడా శివ ఆమె ప్రేమను కోరుకుంటాడా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
హీరో, హీరోయిన్ ప్రేమించుకోవడం వారి ప్రేమను అంగీకరించలేని హీరోయిన్ తండ్రి ఆమెను మరొకరిని ఇచ్చి పెళ్లి చేయడం, హీరో తన ప్రేమను దక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగించే కథలతో చాలా సినిమాలు వచ్చాయి. మన రెగ్యులర్ తెలుగు సినిమా ప్రేమ కథలంటే ఇంతకు మించి ఆశించలేం. కానీ ఇక్కడే దర్శకుడు అజయ్ భూపతి కొత్తగా ఆలోచించాడు. ఎవరూ ఊహించని విధంగా ఈ ప్రేమ కథలో ట్విస్ట్ రాసుకున్నాడు. నిజానికి ఈ కథను శివ అనే వ్యక్తి నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు రాసుకోవడం విశేషం. నాలుగేళ్ల క్రితం మరణించిన ఆ వ్యక్తి జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలని అనుకున్నాడు. అతడి ఆలోచన బాగుంది కానీ తెరపై హీరోయిన్ క్యారెక్టరైజేషన్ తప్ప ఇంకేం కొత్తగా అనిపించదు. కథను చెప్పడం చాలా స్లో గా మొదలుపెట్టిన దర్శకుడు కథలో రియాలిటీని మరింత స్పష్టంగా చెప్పడం కోసం ప్రతి సన్నివేశాన్ని సాగదీసి చూపించాడు. దీంతో చూసే ప్రేక్షకులకు కాస్త బోర్ ఫీల్ కలగడం ఖాయం.

Rx 100 movie telugu review

కానీ ఎప్పుడైతే కథలో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందో.. సినిమాపై ఆసక్తి మొదలవుతుంది. హీరోయిన్ పాత్రను చాలా బోల్డ్ గా చిత్రీకరించారు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్ శ్రుతిమించినట్లుగా ఉంటుంది. వెండితెరపై గాఢమైన ముద్దు సన్నివేశాలను చూడడానికి ఆడియన్స్ కాస్త ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇది కూడా మామూలు సినిమానే కదా అనిపిస్తుంది. కానీ ప్రీక్లైమాక్స్ వచ్చేసరికి కథ మొత్తంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో ఈ ట్విస్ట్ కోసమే దర్శకుడు సినిమా మొత్తం నడిపించాడనిపిస్తుంది. చివరి 20 నిమిషాలు కథకు ప్రాణం పోశాయి. పతాక సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా చిత్రీకరించి కథను విషాదాంతం చేయడం కొత్తదనాన్ని తీసుకొచ్చింది. ప్రేమకథా చిత్రాల్లో ఇటువంటి ట్విస్ట్ ను ముగింపును ఇప్పటివరకు చూసి ఉండరు. నిజ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు ఆఖరులో తెరపై సదరు వ్యక్తి ఫోటో కూడా చూపించారు.

Rx 100 movie telugu review

ఈ కథ నిజమని తెలిసిన తరువాత ప్రతి ఒక్క ప్రేక్షకుడి గుండె బరువెక్కకమానదు. ఈ సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ.. శివ పాత్రలో చక్కగా నటించాడు. ఒక హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ కూడా కార్తికేయలో ఉన్నాయి. నటన పరంగా కూడా ఆకట్టుకుంటాడు. కానీ మొదట సినిమా కాబట్టి డైలాగ్స్ చెప్పే విషయంలో ఇబ్బంది పడినట్లుగా అనిపిస్తుంది. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పాత్ర ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుందని చెప్పలేం. అమ్మడు అందాల ఆరబోత ఓ రేంజ్ లో చేసింది. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు మాత్రమే ఈ పాత్ర నచ్చుతుంది. రావు రమేష్ పాత్ర బాగుంది. ప్రీక్లైమాక్స్ లో అతడి పాత్ర ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. రాంకీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ అతడి స్క్రీన్ ప్రెజన్స్ ఆకట్టుకుంటుంది.

Rx 100 movie telugu review

రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసిన అజయ్ భూపతిపై అతడి ప్రభావం బాగా ఉందనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో వర్మ గుర్తొస్తాడు. కెమెరా వర్క్ కూడా ఆకట్టుకుంటుంది. డిఐ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. నేపధ్య సంగీతం, పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. రెగ్యులర్ ప్రేమ కథలు ఇష్టపడే ఆడియన్స్ కు ఈ సినిమా కొత్తగా అనిపిస్తుంది. అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పిస్తుందని చెప్పలేం కానీ యూత్ కు మాత్రం ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది. 'అర్జున్ రెడ్డి' రేంజ్ లో ఇంపాక్ట్ చూపించాలని అనుకున్నారు కానీ ఎమోషనల్ గా మాత్రం కథను డీల్ చేయలేకపోయారు. అందువల్ల ఈ సినిమా కొందరికి మాత్రమే నచ్చుతుంది. 

రేటింగ్: 2.5/5  

 

                                        

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios