ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా, అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాత్ర టీజర్లు విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో ట్రీట్‌ రాబోతుంది. అలియాభట్‌కి మంచి బర్త్ డే ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. 

ఈ నెల 15(మార్చి 15)న అలియాభట్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఆమె ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. సోమవారం ఉదయం 11గంటలకు అలియా భట్‌ నటించబోతున్న సీత పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. అలియాకిది బెస్ట్ బర్త్ డే ట్రీట్‌గా ఉండబోతుందని చెప్పొచ్చు.  ఇందులో ఆమె రామ్‌చరణ్‌ నటిస్తూ అల్లూరి సీతారామరాజు పాత్రకి పెయిర్‌గా సీతగా కనిపించనున్నారు. ఎన్టీఆర్‌ నటిస్తున్న కొమురంభీమ్‌ పాత్ర సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ నటిస్తుంది. 

దీంతోపాటు ఇందులో ఇద్దరు ఐరీష్‌ నటులు, అలాగే బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌, తమిళ నటుడు సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 13న దసరా కానుకగా విడుదల చేయనున్నారు.