కీరవాణి స్వరపరచిన ఓ సాంగ్ తనకు నచ్చలేదని ఓపెన్ గా చెప్పేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో ఆయన ఈ ఆసక్తికర కామెంట్ చేశారు.

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)తనదైన శైలిలో ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ నిర్వహిస్తున్నారు. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఊపిరి కూడా తీసుకోనీయకుండా వాడేస్తున్నాడు. వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ ఎన్టీఆర్, చరణ్ తీరిక లేకుండా గడుపుతున్నారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణితో ఎన్టీఆర్, చరణ్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీరవాణి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఎన్టీఆర్, చరణ్ లను అడిగారు. 

కాగా నేను స్వరపరిచిన పాటల్లో మీకు నచ్చని సాంగ్ చెప్పాలంటూ ఎన్టీఆర్(NTR), చరణ్ లను ఆయన ఏరుకునబెట్టారు. అయితే ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ మొహమాటం లేకుండా సమాధానం చెప్పారు. ఘరానా బుల్లోడు మూవీలోని ''భీమవరం బుల్లోడా పాలు కావాలా'' సాంగ్ నచ్చలేదని ఎన్టీఆర్ తెలిపారు. 1995లో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ఘరానా బుల్లోడు చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఘరానా బుల్లోడు కమర్షియల్ గా అంతగా ఆడలేదు. నిజానికి ఎన్టీఆర్ నచ్చలేదన్న పాటే ఆ మూవీ ఆల్బమ్ లో హైలెట్. కానీ పాట ఎన్టీఆర్ కి నచ్చలేదట. 

చరణ్ (Ram Charan)మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. రాఘవేంద్రరావు-కీరవాణి కాంబినేషన్ లో తెరకెక్కిన అనేక చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అయితే కీరవాణి సంగీతం కొంచెం అవుట్ డేటెడ్ ఐపోయిందన్న వాదన వినిపిస్తుంది. బాహుబలి సిరీస్ తో పాటు ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు ఆయన ఇచ్చిన సంగీతం ఆ చిత్రాల స్థాయిలో లేదు. 

ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie)పై దేశం మొత్తం హైప్ నెలకొని ఉంది. చాలా కాలంగా ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ మార్చి 25న ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు థియేటర్స్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు. నేడు దేశ రాజధాని ఢిల్లీలో ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ హాజరుకానున్నారు. దీంతో ఆర్ ఆర్ ఆర్ ఢిల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. 

నిర్మాత డివివి దానయ్య రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా నటిస్తున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా... అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.