తమ్మారెడ్డి భరద్వాజ-నాగబాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. నాగబాబు తనపై చేసిన ఆరోపణలకు తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు. అయితే నాగబాబు తిరిగి కౌంటర్ ఇవ్వలేదు.
సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒక సెమినార్ లో చేసిన కామెంట్స్ ని తప్పుబడుతూ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నటుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీని ఆస్కార్ వరకు తీసుకెళ్లేందుకు టీమ్ రూ. 80 కోట్లు ఖర్చు చేశారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఈ కామెంట్స్ కి నిరసన తెలుపుతూ... మీ దగ్గర అకౌంట్స్ ఉన్నాయా? హాలీవుడ్ దిగ్గజ దర్శకులు కూడా డబ్బులు తీసుకుని ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని పొగుడుతున్నారని నీ అర్థమా? అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు.
నాగబాబు అయితే దారుణమైన భాషలో 'నీయమ్మా మొగుడు ఎనభై కోట్లు ఖర్చు చేశాడా?, వైసీపీ నాయకుల భాషలో సమాధానం' అంటూ ట్వీట్ చేశారు. తమ్మారెడ్డి కామెంట్స్ కి ఆయన రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. అలాగే ఒక వీడియో బైట్ విడుదల చేశారు. నీ వల్ల కుక్కకు కూడా ప్రయోజనం లేదు. నువ్వేం గొప్ప సినిమాలు తీశావని విశ్లేషణలు చేస్తున్నావు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు దక్కుతుంటే ఈర్ష్య, ద్వేషాలు ఎందుకు. గతంలో మెగా ఫ్యామిలీ మీద అనుచిత కామెంట్స్ చేశావు. ఇకపై నోరు అదుపులో పెట్టుకో, నువ్వు నాకు కౌంటర్ ఇవ్వాలనుకుంటే లక్ష రెట్లు కౌంటర్ ఇవ్వడానికి సిద్ధం, అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
రాఘవేంద్రరావు, నాగబాబు కామెంట్స్ మీద తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. మూడు గంటల సెమినార్ లో నేను మాట్లాడిన ఒక నిమిషం క్లిప్పింగ్ తీసుకొని ఆరోపణలు చేస్తున్నారు. నాకు పరిశ్రమలో అందరి అకౌంట్స్ తెలుసు. అవార్డుల కోసం, పదవుల కోసం ఎవరెవరు ఎవరి కాళ్ళు పెట్టుకున్నారో తెలుసు. భూమ్మీద లేని మా అమ్మానాన్నల గురించి ఎందుకు. నా అమ్మా మొగుడు నాకు సంస్కారం నేర్పాడు. నేను తప్పు చేయలేదు. ఇలాంటి కామెంట్స్ చేసినందుకు మీరు సిగ్గుపడాలి... అంటూ తీవ్ర స్థాయిలో తమ్మారెడ్డి ధ్వజమెత్తాడు.
తమ్మారెడ్డి వ్యాఖ్యలపై నాగబాబు స్పందించలేదు. కౌంటర్ గా ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్ చేయలేదు. మీడియా ముందుకు రాలేదు. ఈ క్రమంలో నాగబాబు-తమ్మారెడ్డిల వివాదం ముగిసినట్లే అంటున్నారు. పరిశ్రమ వర్గాలు సైతం ఇది, ఇంతటితో ఆపేస్తే బెటర్ అంటున్నారు. వ్యక్తిగత అజెండాలతో ఆర్ ఆర్ ఆర్ మూవీని వివాదాల్లోకి లాగడం సరి కాదంటున్నారు. అయితే ఈ వివాదం అప్పుడే ఒక కొలిక్కి వచ్చిందని చెప్పలేం. చూడాలి మెగా బ్రదర్ నాగబాబు ఎలాంటి అస్త్రాలతో వస్తారో...
