దర్శక ధీరుడు యస్‌.యస్‌ రాజమౌళి,ఆయన ఫ్యామిలీ సభ్యులు అంతా కరోనాను జయించారు. తిరిగి యధావిధిగా పనుల్లో పడిన సంగతి తెలిసిందే. తమ తాజా ప్రాజెక్టు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విషయమై ఆయన ఈ సారి సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్దితుల్లోనూ త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు దసరా నుంచి కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు రాజమౌళి అనువైన, ఏ విధమైన ఇబ్బందులు రానటువంటి ప్లానింగ్ చేసినట్లు  సమచారం. ఈ మేరకు వర్క్ ప్రారంభం అయ్యింది. అల్యూమినయం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో షూట్ ప్రారంభం కానుంది.
 
లాక్ డౌన్ కు ముందు అక్కడ ఈ సినిమా కోసం సెట్ వేసినా, చాలా రోజులుగా దాన్ని వాడకపోవటంతో కొంత మేరకు పాడైపోయింది. ఇప్పుడు దాన్ని శుభ్రం చేసి, డామేజ్ అయిన చోట రిపేర్స్ చేయించబోతున్నారు. ఈ మేరకు ఓ టీమ్ పర్యవేక్షించనుంది. త్వరలోనే ఆ పనులు ప్రారంభం కానుంది. నిర్మాతకు ఇది ఊహించని బడ్జెట్టే. కానీ తప్పదు. ఇప్పుడు రిపేర్లు చేయించి సెట్ ని వాడుకోవటం కొత్త సెట్ వేయటం కన్నా బెస్ట్ అని ఆయన భావిస్తున్నారట.

 ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా మొత్తంలో పలు గెటప్స్‌లో కనిపిస్తారట ఈ ఇద్దరు హీరోలు. బ్రిటిష్‌ అధికారులను ఎదుర్కొనే ప్రయత్నంలో రకరకాల గెటప్స్‌ వేసి వాళ్లను తెలివిగా ఢీ కొంటారని చెప్తున్నారు. పోలీస్‌ ఆఫీసర్‌గా చరణ్, బందిపోటు గెటప్‌లో ఎన్టీఆర్‌ కనిపిస్తారట.

మరికొన్ని గెటప్స్‌లోనూ ఎన్టీఆర్, చరణ్‌లు కనిపిస్తారని తెలిసింది. ఈ స్పెషల్‌ గెటప్స్‌ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటించనున్నారు.ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.