ఆర్పీ పట్నాయక్‌ ఈ పేరు వినగానే మనకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి.  తన మ్యూజిక్‌తో యూత్‌ను సైతం మెస్మరైజ్‌ చేసిన ఆయన నటన వైపు మళ్లారు. శ్రీను వాసంతి లక్ష్మి అనే సినిమాలో హీరోగా చేసారు. ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత నటన ప్రక్కన పెట్టి..డైరక్టర్ అవతారం ఎత్తారు. అయితే ఇక్కడా సక్సెస్ కాలేదు.దర్శకుడిగా మారి ‘అందమైన మనసులో’ అనే సినిమా తీశారు. ఈ ప్రేమకథకు మంచి పేరు అయితే వచ్చింది కానీ.. కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు.

ఆ తర్వాత ‘బ్రోకర్’ అనే సినిమా తీశారు. ఈ సినిమా ఆశించిన స్దాయిలో ఆకట్టుకోకపోయినా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆతర్వాత ‘ఫ్రెండ్స్ బుక్, తులసీదళం, మనలో ఒక్కడు’ సినిమాలు తీశారు. దాదాపు అర‌డజ‌ను సినిమాలు తీసినా ఏదీ వర్కవుట్ కాలేదు. దాంతో కొన్నాళ్లుగా సంగీతానికి, ద‌ర్శక‌త్వానికీ దూరంగా ఉన్నారాయ‌న‌. ఇప్పుడు మ‌ళ్లీ మెగాఫోన్‌పై ఆశ పుట్టినట్లుంది. ఓ సినిమా చేసి వదిలారు.

 `కాఫీ విత్ కిల్ల‌ర్‌`టైటిల్ తో ఓ సినిమా మొదలెట్టి పూర్తి చేసారు. ఇదో క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వం, సంగీతం, నిర్మాణం.. ఇలా అన్ని ర‌కాల బాధ్య‌త‌ల్నీ మ‌ళ్లీ త‌న‌పైనే వేసుకున్నాడు . షూటింగ్  పూర్త‌ి చేసి విడుద‌లకు రంగం సిద్దం చేసాడు. సంగీత ద‌ర్శ‌కుడిగానూ ఇప్పుడు వ‌డి వ‌డిగా అడుగులు వేయ‌డానికి సంసిద్ధ‌మ‌య్యారు ఆర్పీ. ఓ వెబ్ సిరీస్ కి ఆర్పీ సంగీతం అందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక నుంచైనా ఆర్పీ ప్ర‌యాణం ట్రాక్ లో ప‌డుతుందేమో చూడాలంటున్నారు అభిమానులు.