వెస్ట్ బెంగాల్ లో రాజకీయ ప్రకంపనలకు వేదికైన రోజ్ వ్యాలీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరో అడుగు ముందుకేసింది. ఈ కుంభకోణంలో ప్రముఖ నటుడు, బెంగాల్ స్టార్ హీరో ప్రసేన్ జిత్ ఛటర్జీ హస్తం ఉందంటూ మంగళవారం నాడు సమన్లు జారీ చేసింది.

2010-12 మధ్యకాలంలో రోజ్ వ్యాలీ కంపనీ పలు సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారితో ఛటర్జీ భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపారని ఈడీ పేర్కొంది. దీనిపై జూలై 19లోపు తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

ఈ విషయం ఇప్పుడు బెంగాల్ లో హాట్ టాపిక్ గా మారింది. బెంగాల్ లో సంచలనంగా మారిన రోజ్ వ్యాలీ స్కాంలో ఇప్పటికే అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కూడా ఈ కుంభకోణంపై దుమారం చెలరేగింది.

బెంగాల్ ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ మెహతా కూడా ఈ స్కాంలో ఉన్నారని, పాతిక కోట్లు తీసుకున్నారనే ఆరోపణలతో ఆయన ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు.