సంచలన దర్శకుడిగా తనకంటూ ఒక విలక్షణమైన గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ సక్సెస్ ను చూసి చాలా కాలమవుతోంది. ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకోవడం తనకు ఇష్టం ఉండదని చెప్పే వర్మ ఇప్పుడు సక్సెస్ కొట్టేస్తాను అని చెబుతున్నాడు. అది కూడా తన శిష్యుడు తెరకెక్కించిన భైరవగీత తో బ్రేక్ అందుకుంటాడట. 

వర్మ సమర్పణలో రానున్న ఈ సినిమా 30వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వర్మ ఈ విధంగా స్పందించాడు. ఈ భైరవగీత సినిమా నాకు నా యూనిట్ కు మంచి బ్రేక్  ఇస్తుంది. తప్పకుండా సక్సెస్ అందుకుంటా. దర్శకుడు సిద్దార్థ్ కథను చెప్పిన విధానం చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఆడియెన్స్ కూడా అదే తరహాలో ఫీల్ అవుతారు అనుకుంటున్నా అని తెలిపారు. 

అయితే సినిమా టీజర్ ట్రైలర్ చూస్తుంటే వర్మ పోలికలు బాగానే కనిపిస్తున్నాయనే సందేహాలకు వర్మ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. ప్రతి ఒక్కరిలో ఎదో ఒక సందర్భంలో ఇతరుల ప్రభావితం కనిపిస్తుంటుంది. దర్శకుడు సిద్దార్థ్ కూడా కొన్ని నా శైలికి తగ్గట్టు చేసి ఉండవచ్చు. అయితే సినిమా చుస్తే తప్పకుండా అతని స్టైల్ ఉంటుందని నమ్మకంగా చెబుతున్నట్లు వర్మ వివరణ ఇచ్చారు. 

ఇక ఆఫీసర్ కి ముందు సక్సెస్ కొడతా అని ఎన్నో చెప్పిన వర్మ ఆ సినిమా రిలీజ్  తరువాత కొన్నాళ్లు సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఫెయిల్యూర్ నుంచి తాను ఏమి నేర్చుకొనని ఆ ప్రాజెక్ట్ మిస్ ఫైర్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు భైరవగీత తో తప్పకుండా హిట్ కొడతానని శపథం చేసిన వర్మ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.