మన దేశాన్ని  వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో క‌నుమ‌రుగ‌య్యేలా లేదు. జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యే వ‌ర‌కూ కొవిడ్-19 ప్ర‌పంచాన్ని విడిచిపెట్ట‌ద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ కూడా చెప్తోంది. అయితే వాక్సిన్స్ కొరతతో ఇప్పుడిప్పుడే  అందరికీ వాక్సినేషన్ జరిగే పరిస్దితి కనపబడటం లేదు. ఈ లోగా జనం కరోనా కాటుతో విలవిల్లాడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. జనం హాస్పటిల్స్ చుట్టూ తిరుగుతూ లక్షలు బిల్లులు కడుతున్నా ప్రాణాలు దక్కించుకోలేని పరిస్దితి. ఈ నేపధ్యంలో ఏ చిన్న ఆధారం దొరికినా ఆనందంగా ఫీలవుతున్నారు. దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. 

 ఈ సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణ పట్నంకు చెందిన ఆనందయ్య మందు కనిపెట్టి పంపిణీ మొదలెట్టారు. ఆయన మందు పనితీరు గురించి మీడియాలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా చాలా మాత్రం ఆ ఔషదం అద్బుతం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సెలబ్రెటీలు ఆ మందును వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తోడు సెలబ్రెటీలు ఆనందయ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. సెలబ్రెటీల్లో ఇప్పటికే జగపతి బాబు స్పందిస్తూ ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలన్నాడు. బాలయ్య సైతం ఈ మందుపై వ్యాఖ్యానం చేసారు. 

కొంద‌రు ఇది నాటు మందు అంటుంటే మ‌రి కొంద‌రు, శాస్త్రీయత లేదని ఆనందయ్య మందును నిషేధించాలని ఇంకొందరు అంటున్నారు. మెజారిటీ జనాలు మాత్రం ఆనందయ్య మందుకే ఓటేస్తున్నారు. తాజాగా రేణూ దేశాయ్ ఆనందయ్య మందుపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. 
 
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ‘ఆయుర్వేదాన్ని నేను బాగా నమ్ముతాను. అలాగే, ఆనందయ్య ఇస్తున్న మందును కూడా నమ్మాలనే అనిపిస్తోంది. దీనికి కారణం ఆయన ఉచితంగా దీన్ని పంపిణి చేయడంతో పాటు ఎంతో మందికి కరోనా నయం అయిందని చెబుతుండడమే. నిజం కాకపోతే దీనికి ఆ రేంజ్‌లో రెస్పాన్స్ రాదు కదా' అంటూ ఊహించని కామెంట్స్ చేశారు రేణు దేశాయ్.