ఇండస్ట్రీలో ఏదైనా కొత్త సినిమా విడుదలవుతుందంటే తారలంతా ఆ హడావిడే వేరుగా ఉంటుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే ఇక సెలబ్రిటీలందరూ కూడా సోషల్ మీడియా వేదికంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతుంటారు.

'మహానటి' సినిమా విడుదలైన సమయంలో ఇండస్ట్రీలో స్టార్లు అందరూ సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు. మహేష్ బాబు, నాగార్జున, రాజమౌళి, లాంటి వారు సినిమా గురించి గొప్పగా ట్వీట్లు చేశారు. అల్లు అర్జున్ అయితే ఏకంగా టీమ్ మొత్తానికి స్పెషల్ పార్టీ కూడా ఇచ్చాడు.

కానీ ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో అలాంటి రిటర్న్ గిఫ్టులు ఏవీ రాలేదు. అంతవరకు ఎందుకు.. మహేష్ బాబు తప్ప సినిమా తారలు ఎవరూ పెద్దగా స్పందించలేదు. జూనియర్ ఎన్టీఆర్ తన తాతయ్య బయోపిక్ పై ఇప్పటివరకు కామెంట్ చేయలేదు. అభిమానులకు సంక్రాంతి విషెస్ చెప్పిన తారక్ తన తాతయ్య బయోపిక్ గురించి మాత్రం నోరు విప్పలేదు. నాగార్జున కూడా ఈ సినిమాపై ఎలాంటి కామెంట్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఏఎన్నార్ కి కథలో ప్రాముఖ్యతనిస్తూ సినిమాను తెరకెక్కించారు. కానీ నాగ్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గానే ఉన్నారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ కి అతి పెద్ద అభిమానినని చెప్పుకునే దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.

అప్పట్లో చిన్నా, పెద్దా ప్రతీ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పే రాజమౌళి ఇప్పుడు తన ఫేవరేట్ హీరో బయోపిక్, పైగా తన స్నేహితుడు సాయి కొర్రపాటి కోప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సినిమా అలాంటిది ఈ సినిమాపై ఒక్క కామెంట్ కూడా చేయలేదు.