లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా రీసెంట్ గా  సీరియళ్ల షూటింగ్‌లను ప్రారంభించగా.. అందులో పాల్గొంటున్న వారు ఒక్కొక్కరుగా వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఓ ఐదారు మంది పేరు మోసిన బుల్లితెర నటులకు కరోనా సోకగా..  ‘ఆమె కథ’, ‘వరూధిని పరిణయం’ ఫేమ్, ‘బిగ్‌బాస్‌ 3’ కంటెస్టెంట్‌ రవికృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే కొంతమంది తాను కరోనా బారిన పడటంతో భలే అయ్యిందంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని వాపోయాడు రవికృష్ణ. ఈ నేపధ్యంలో రవికృష్ణ.. తనకు కరోనా ఎలా వచ్చిందో చెప్పుకొచ్చాడు. షూటింగ్స్ లో ఆర్టిస్టులకే ఎక్కువగా కరోనా సోకే ప్రమాదముందంటున్న రవికృష్ణ.. దురదృష్టవశాత్తూ తనకు సోకిందంటున్నాడు.

రవికృష్ణ మాట్లాడుతూ..."మాకు మాస్క్ పెట్టుకునే అవకాశం ఉండదు. టెక్నీషియన్స్ తో పాటు మిగతా డిపార్ట్ మెంట్ వాళ్లు పెట్టుకుంటారు. మాకు ఆ ఛాన్స్ లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ ఆర్టిస్టుకే రిస్క్ ఎక్కువ. ఎందుకంటే రిహార్సల్స్, టేక్స్ అప్పుడు మాస్క్ పెట్టుకోం. సో.. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడో నాకు వైరస్ ఎటాక్ అయింది." అన్నారు.

అలాగే ..నాకు కరోనా సోకిన తరువాత పరిస్థితులు.. కామెంట్స్ చూస్తే బాధ వేస్తుంది. అయ్యో కరోనా వచ్చిందా?? అని అనేవాళ్లు కొందరైతే.. భలే బాగా అయ్యింది.. లేకపోతే ఇప్పుడు షూటింగ్‌లు అవసరమా? అని అంటున్నారు. మీరు మాకు ధైర్యం చెప్పకపోయినా పర్లేదు. కాని.. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయకుండా సైలెంట్‌గా ఉన్నా చాలు. ఇది మన దరిద్రమో ఏమో తెలియదు కాని.. ఇలాంటివి చూస్తే బాధగా ఉంది అని అన్నారు.

తమపై నీచమైన కామెంట్ చేసే వాళ్లను చూస్తే బాధేస్తుంది. ఒకరికి బాలేక ఇబ్బంది పడుతుంటే.. నీ వల్ల అయితే వాళ్లకు హెల్ప్ చేయి.. మెంటల్‌ అండ్ మోరల్ సపోర్ట్ అందించు. లేదంటే సైలెంట్‌గా ఉండు. వాళ్లు బతుకు వాళ్లు బతుకుతారు. ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్న వారికి కరోనాను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదు.. దీన్ని ఎదుర్కొంటారు.

బయట తిరిగారు ఇలా అయ్యింది.. షూటింగ్ కి వెళ్లారు భలే అయ్యిందని అంటున్నారు. వాళ్లని చూస్తే జాలేస్తుంది. అరే పిచ్చోడా.. ఈరోజు నాకు వచ్చింది.. రేపటి రోజున మీ ఇంట్లోవాళ్లకు నీకు కూడా రావచ్చు. కాస్త సెన్స్ పెట్టి మాట్లాడండి.. ఎవ్వరూ కావాలని ఏదీ చేయరు. కావాలని రోగం తెచ్చుకోరు అని చెప్పుకొచ్చారు.

ఇక నవ్య, తను ఒకే సీరియల్ (ఆమె కథ)లో లీడ్స్ గా చేస్తున్నామని.. ఒకే సీరియల్ కు చెందిన హీరోహీరోయిన్లు ఇలా కరోనా బారిన పడడం ఏ సీరియల్ కు జరగలేదంటున్నాడు. అయినప్పటికీ తను సేఫ్ గానే ఉన్నానని, త్వరగా కోలుకుంటున్నానని చెబుతున్నాడు.