పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయని హార్ద్ కౌర్( తరన్ కౌర్ ధిల్లాన్) పై దేశద్రోహం కేసు నమోదైంది. ఆమె ఏకంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తీవ్రమైన చిక్కుల్లో చిక్కుకుంది. యోగి ఆదిత్య నాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై హార్ద్ కౌర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

సీఎం యోగి ఆదిత్యనాధ్ ఒక రేప్ మ్యాన్. ఇకపై అతడిని అలాగే పిలవండి అంటూ హార్ద్ కౌర్ సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉగ్రవాది అని, దేశంలో జరుగుతున్న పలు ఉగ్ర దాడులకు ఆర్ఎస్ఎస్ కారణం అంటూ హార్ద్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడులు, పుల్వామా అటాక్ కు కారణం ఆర్ఎస్ఎస్ అని పేర్కొంది. 

దీనితో ప్రముఖ న్యాయవాది, ఆర్ఎస్ఎస్ కార్యకర్త శశాంక్ వారణాసిలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. హార్ద్ కౌర్‌పై సెక్షన్ 124 ఏ, 153 ఏ, 500 కింద కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో హార్ద్ కౌర్ కు కొందరు మద్దత్తు తెలుపుతుంటే, మరికొందరు ఆమె వ్యాఖ్యలని తీవ్రంగా తప్పుబడుతున్నారు.