కరోనా విజృంభన కాస్త తగ్గుముఖం పడుతుందని అంతా ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో, అది మరోసారి విస్తరిస్తుంది. ఇటీవల ఎనిమిది రాష్ట్రాల్లో అది మళ్లీ పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఓ వైపు కరోనా, మరోవైపు కొత్త కరోనా `స్ట్రెయిన్‌`తో జనం ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సినీ ప్రియులకు షాక్‌ తగిలింది. రణ్‌బీర్‌ కపూర్‌కి కరోనా సోకింది. ఆయన కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు ఆయన తల్లి నీతూ కపూర్‌ వెల్లడించారు. 

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రణ్‌బీర్‌ తల్లి తెలియజేస్తూ, `పరీక్షలో రణ్‌బీర్‌కి కోవిడ్‌ 19 పాజిటివ్‌ వచ్చింది. అతను ఇప్పుడు మెడిసిన్‌ తీసుకుంటున్నారు. ఇంట్లో స్వీయ నిర్భందంలో ఉన్నాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎవరూ ఆందోళన చెందవద్దు. మీరు చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు` అని తెలిపింది. ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌ `బ్రహ్మాస్త్ర` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు `శంషేరా`, `యానిమల్‌`, అలాగే లవ్‌ రంజన్‌తో ఓ సినిమా చేయనున్నారు.